రేపే డిశ్చార్జ్.. ఆరు వారాలు విశ్రాంతి తీసుకోనున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ(Nandamuri balakrishna) ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడుతున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయనను రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సర్జరీ తర్వాత గత రెండు రోజులుగా రికవరీ సంతృప్తికరంగా ఉండటంతో డాక్టర్లు కూడా ఆయన ఆరోగ్యంపై సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల రాజమండ్రి పరిసరాల్లో NBK111 సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా బాలకృష్ణకు మోకాలి భాగంలో గాయం అయింది.
మొదట అక్కడే ఫస్ట్ ఎయిడ్ అందించి, తర్వాత మెరుగైన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. టెస్టుల్లో ఎడమ కాలి క్వాడ్రిసెప్స్ టెండన్ చీలిపోవడంతో పాటు మోకాలి చుట్టూ ఉన్న కండరాలు, లిగమెంట్లకు కూడా దెబ్బతగిలినట్లు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత డాక్టర్లు మూడు గంటలకు పైగా సర్జరీ చేసి చీలిన టెండన్‌ను మళ్లీ మోకాలి ఎముకకు అనుసంధానం చేయడంతో పాటు దెబ్బతిన్న ఇతర కణజాలాన్ని కూడా సరిచేశారు. గాయం కారణంగా పేరుకుపోయిన రక్తాన్ని తొలగించిన తర్వాత సర్జరీని ఎలాంటి సమస్యలు లేకుండా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం స్థిరంగా ఉండటంతో రేపు ఆయనను ఇంటికి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో కోలుకునేందుకు వైద్యులు సుమారు ఆరు వారాల విశ్రాంతిని సూచించినట్లు సమాచారం. తర్వాత డాక్టర్ల పర్మిషన్ తో ఆయన మళ్లీ NBK111 షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది. దీంతో అభిమానులు బాలయ్య త్వరగా పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.








