2,500 ఏళ్ల ఆలోచన… ఇప్పటికీ మన జీవితాన్ని నడిపిస్తోంది!
—శివ దువ్వూరు
వాళ్లు ముగ్గురూ ఒకరిని ఒకరు ఎప్పుడూ కలవలేదు.
ఒకరి పేరు మరొకరు ఎప్పుడూ వినలేదు.
వాళ్ల మధ్య…
పర్వతాలు ఉన్నాయి.
ఎడారులు ఉన్నాయి.
సముద్రాలు ఉన్నాయి.
వాళ్లను కలిపే రహదారులు కూడా లేవు.
అయినా… వాళ్ల ముగ్గురినీ ఒకే ప్రశ్న వెంటాడింది.
రెండున్నర వేల సంవత్సరాల క్రితం… ప్రపంచంలో జరిగిన చిత్రమైన విషయం ఇది. దానికి యుద్ధం కారణం కాదు.కొత్త సామ్రాజ్యాల ఏర్పాటు కారణం కాదు.మానవ వలసలు కాదు. మనిషి తన గురించి తాను కొత్తగా ఆలోచించడం కారణం.
చరిత్రకారుల దృష్టిలో… మానవ ఆలోచనలో ఒక గొప్ప మలుపు ఆ సమయంలోనే మొదలైంది. చరిత్ర ఈ యుగాన్ని ‘Axial Age’ అని పిలుస్తుంది. దాని అర్థం …మనిషి తొలిసారి ప్రపంచాన్ని కాదు… తనను తాను ప్రశ్నించడం ప్రారంభించిన కాలం అది! అని.
మానవ చరిత్రలో తొలిసారి, ప్రపంచంలోని వేర్వేరు మూలల్లో మనిషి ఒకే ఒక్క ప్రశ్న అడగడం మొదలుపెట్టాడు.
ఆ ప్రశ్న “మంచి జీవితం అంటే ఏమిటి?”.
ఆ ప్రశ్న…భారతదేశంలో బుద్ధుడిని, గ్రీస్‌లో సోక్రటీస్‌ను, చైనాలో కన్ఫ్యూషియస్‌ను…వేర్వేరు చోట ఉన్నా దాదాపు ఒకే దారుల్లో నడిపించింది.
ఇక ఈ పెద్ద ప్రశ్న ఎదురైనప్పుడు, ప్రపంచంలోని మూడు నాగరికతలు మూడు వేర్వేరు దారులను ఎంచుకున్నాయి:
భారత్ ఒక దారిని ఎంచుకుంది — లోపలికి చూసే దారిని. (బాధ ఎందుకు వస్తుంది? కోరికలను ఎలా జయించాలి? అని బుద్ధుడు, ఉపనిషత్తులు అంతర్మథనం చేశాయి.)
గ్రీస్ మరో దారిని ఎంచుకుంది — బయట ప్రపంచాన్ని ప్రశ్నించే దారిని. (సమాజం ఎలా ఉండాలి? మంచి పాలన అంటే ఏమిటి? అని సోక్రటీస్, అరిస్టాటిల్ తర్కానికి పదును పెట్టారు.)
చైనా మూడో దారిని చూపించింది — మనిషి ఒంటరిగా కాదు… సమాజంలోనే సంపూర్ణమవుతాడని. (కుటుంబ వ్యవస్థ, సామాజిక సామరస్యం, నైతిక క్రమమే ముఖ్యం అని కన్ఫ్యూషియస్ నమ్మాడు.)
వేర్వేరు దారుల్లో నడిచినా… ఆశ్చర్యకరంగా కొన్ని చోట్ల వాళ్ల ఆలోచనలు ఒకే గీత మీద కలుసుకున్నాయి.
అరిస్టాటిల్ చెప్పిన Golden Mean (మధ్యేమార్గం) సరిగ్గా బుద్ధుడు చెప్పిన మధ్యమ మార్గాన్ని పోలి ఉంది. గ్రీకులు అణువు గురించి మాట్లాడితే, మన ఋషి కణాదుడు పరమాణు సిద్ధాంతాన్ని ముందుగానే రాశాడు. సోక్రటీస్ ప్రశ్నల ద్వారా సత్యం వెతికితే, మన న్యాయ తత్వం కూడా తర్కానికే పెద్ద పీట వేసింది.
కాలం గడిచింది. అలెగ్జాండర్ దండయాత్రల పుణ్యమా అని ఈ ప్రపంచాలు నిజంగానే కలుసుకున్నాయి. గాంధార ప్రాంతంలో ఇండో-గ్రీక్ రాజ్యాలు పుట్టాయి.
అక్కడ మన తత్వాలు, గ్రీకు ఆలోచనలు పరస్పరం మాట్లాడుకున్నాయి. గ్రీకు తాత్వికుడు పైరో భారతదేశానికి వచ్చి మన సన్యాసులను చూసి ప్రభావితమై ‘Pyrrhonism’ అనే తత్వాన్ని సృష్టించాడు. ఇండో-గ్రీక్ రాజు మెనాండర్, బౌద్ధ భిక్షువు నాగసేనునికి మధ్య జరిగిన చర్చలు ‘మిలింద పన్హ’గా మిగిలాయి.
అయితే ఇక్కడ ఓ విషయం గుర్తు చేసుకోవాలి. భారత్ దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పటినుంచో ఉంది. అదేమిటంటే… ప్రపంచాన్ని గెలవడానికి ముందు… మనసును గెలవాలి.
బుద్ధుడు ఒక్కసారిగా కొత్త ఆలోచన తీసుకురాలేదు. ఆయన నడిచిన దారికి శతాబ్దాల ముందే వేదాలు, రామాయణం, మహాభారతం పునాదులు వేశాయి. క్రీ.పూ. 1500–800 మధ్య కాలం నాటికే మన సమాజం ధర్మం, కర్తవ్యం, నైతికత అనే బలమైన విలువలపై నిలబడింది. రామాయణ మహాభారతాలు కేవలం ఇతిహాసాలు కావు. రాముడి రాజధర్మం, మహాభారతంలోని ధర్మసంకటాలు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మ …ఇవన్నీ మన సమాజాన్ని శతాబ్దాల పాటు నడిపించాయి. అప్పట్లో తత్వశాస్త్రం పెద్ద పెద్ద పుస్తకాల్లో లేదు, ప్రజల నిత్య జీవితాల్లో భాగమై ఉండేది.
చివరికి చూస్తే…
భారత్ మనిషిని అడిగింది… “నీ మనసును గెలిచావా?”
గ్రీస్ అడిగింది… “నీ ప్రపంచాన్ని మెరుగుపరిచావా?”
ఈ రోజు… మీ చేతిలో AI ఉంది. ప్రపంచంలోని దాదాపు మొత్తం సమాచారం మీ జేబులో ఉంది.
ఒక రకంగా చెప్పాలంటే… గ్రీస్ చూపించిన బాటలో, మనం బయటి ప్రపంచాన్ని దాదాపు జయించేశాం.
మరి మనసును జయించామా?
టెక్నాలజీ మనకు “ప్రపంచాన్ని జయించే” అద్భుతమైన సాధనాలను ఇచ్చింది. కానీ, “మనసును జయించే” మార్గాన్ని మాత్రం ఏ సెర్చ్ ఇంజిన్ ఇవ్వలేకపోయింది.
అందుకే… రెండున్నర వేల ఏళ్ల నాటి ఆ ప్రశ్న ఈనాటికీ పాతబడలేదు.
బయట ప్రపంచాన్ని ఎంత జయించినా… మనిషి తనను తాను జయించే ఆఖరి పోరాటం ఇంకా మిగిలే ఉంది. టెక్నాలజీ మారొచ్చు, యుగాలు మారొచ్చు… కానీ ప్రపంచానికీ-మనసుకూ మధ్య జరిగే ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియదు!








