జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులతో అనుసంధానం చేయాలి – గ్రామాల్లో మద్య నియంత్రణను కఠినంగా అమలు చేయాలి
– వీస్ విజయ్ వర్మ పాకలపాటి, జాతీయ గ్రామీణ స్థితిగతుల కమిటీ ఛైర్మన్, ఆల్ ఇండియా పంచాయత్ పరిషత్ జాతీయ కార్యదర్శి & దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త
గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనా పరంగా బలోపేతం చేయడంతో పాటు గ్రామాలను గ్రామ స్వరాజ్యం దిశగా తీర్చిదిద్దితేనే గ్రామీణ భారత్ స్వయం సమృద్ధిని సాధిస్తుందని ఆల్ ఇండియా పంచాయత్ పరిషత్ 19వ జాతీయ సదస్సు కార్యవర్గం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో నిర్వహించిన 19వ జాతీయ సదస్సులో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా పంచాయత్ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి సుభోద్ కాంత్ సహాయ్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 73వ, 74వ రాజ్యాంగ సవరణలు ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం ఆందోళనకరమని అన్నారు. గ్రామీణ స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన అధికారాలు, నిధులు, విధులను సమర్థంగా అమలు చేయకపోతే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
ఆల్ ఇండియా పంచాయత్ పరిషత్ జాతీయ కార్యదర్శి, దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త, జాతీయ గ్రామీణ స్థితిగతుల కమిటీ ఛైర్మన్ వీస్ విజయ్ వర్మ పాకలపాటి మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీల పరిస్థితిపై నిర్వహించిన అధ్యయనంలో అధిక సంఖ్యలో సర్పంచులు నిధుల లేమితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని పరిస్థితి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతోందని పేర్కొంటూ, కేవలం చెక్ పవర్ ఇవ్వడం సరిపోదని, స్థానిక సంస్థలకు కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
ప్రస్తుతం సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడటంతో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించలేక అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. స్థానిక సంస్థలకు సంపూర్ణ అధికారాలు, ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించినప్పుడే మహాత్మా గాంధీ ఆశయమైన గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా గ్రామాల్లో అడుగడుగునా పెరుగుతున్న మద్యం దుకాణాల కారణంగా యువత మద్యానికి బానిసలుగా మారి, దేశాభివృద్ధికి ఉపయోగపడాల్సిన ఒక తరం నిర్వీర్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ సమాజ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో మద్య నియంత్రణను కఠినంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రైతులతో అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయానికి అవసరమైన పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయడం ద్వారా రైతులకు ఉపశమనం కలుగుతుందని, లేకపోతే రైతాంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. గ్రామీణ భారత్ సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం మరియు మద్య నియంత్రణ అనే రెండు అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యంతో చర్యలు చేపట్టాలని కోరారు.
న్యూఢిల్లీలో తెలంగాణ పంచాయత్ పరిషత్ భవన నిర్మాణానికి ఆల్ ఇండియా పంచాయత్ పరిషత్ సముదాయంలో స్థలం కేటాయించాలని వీస్ విజయ్ వర్మ పాకలపాటి, తెలంగాణ పంచాయత్ పరిషత్ అధ్యక్షుడు ఎం. ఎ. జలీల్, గ్రేటర్ హైదరాబాద్ నగరపాలిక అధ్యక్షురాలు ఝాన్సీ సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు.
ఈ జాతీయ సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ పంచాయత్ పరిషత్ అధ్యక్షుడు ఎం. ఎ. జలీల్, ఆంధ్రప్రదేశ్ పంచాయత్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు చిదంబరం రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగరపాలిక అధ్యక్షురాలు ఝాన్సీ, ఇటీవల ఆల్ ఇండియా పంచాయత్ పరిషత్ జాతీయ కార్యదర్శిగా నియమితులైన పి. సత్యనారాయణ, తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు హాజరయ్యారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించిన ఈ సదస్సులో ఆల్ ఇండియా పంచాయత్ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షుడు డా. అశోక్ చౌహాన్, ఉపాధ్యక్షుడు ధ్యాన్పాల్ సింగ్, ప్రధాన కార్యదర్శి అనిల్ శర్మ, కేంద్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








