నిరసనలను విరమిస్తున్నాం.. సీజేపీ కీలక ప్రకటన
నీట్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరింది. అలాగే సీజేపీ పెట్టిన మిగతా డిమాండ్లను కూడా కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో తాము నిరసనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరం కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు.
చర్చల తర్వాతే నిరసనలను విరమిస్తున్నట్లు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. తర్వాత కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ తో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిరసనకారులపై నమోదైన కేసులను కొట్టేయాలని తాము కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన కేసులను కొట్టేయాలని కోరినట్లు సీజేపీ పేర్కొంది. నాలుగు రోజుల్లోగా కేసులను ఎత్తేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, భవిష్యత్తులోనూ వేధించబోమని కూడా చెప్పిందన్నారు. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు, విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు కూడా కేంద్రం అంగీకరించిందని తెలిపారు.
కేసులు ఎత్తేస్తాం : జేపీ నడ్డా
నిరసనకారులపై పెట్టిన కేసులు ఎత్తేసేందుకు అంగీకరించామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఢిల్లీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టిన కేసులను ఎత్తేస్తామన్నారు. విద్యా వ్యవస్థ, పరీక్షల్లో సమూల మార్పుులు చేస్తామని ఇప్పటికే చెప్పామని, భవిష్యత్తులో ఎవరినీ కేసులతో వేధించబోమన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అండగా వుంటామన్నారు.








