ChatGPT వెనుక తెలుగు మేధస్సు… గోదావరి జిల్లా కుర్రాడి అద్భుత ప్రస్థానం!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామం…
ఆ ఊరిలోని ఒక ఇంట్లో పుట్టిన కల… ఈ రోజు ప్రపంచం మొత్తం వాడుతున్న ChatGPT వెనుక నిలిచింది. అతనే…
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నమ్మిన వ్యక్తి…
ఇప్పుడు OpenAIలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగు మేధస్సు.,
మన గోదావరి జిల్లా కుర్రాడు ఉదయ్ రుద్రరాజు.
ప్రపంచంలో ఈ రోజు అత్యంత తీవ్రంగా సాగుతున్న పోటీ ఏదైనా ఉందంటే… అది AI రంగంలోనే. ChatGPTతో OpenAI ఒకవైపు… Grokతో ఎలాన్ మస్క్ సంస్థ xAI మరోవైపు. ఈ పోటీలో గెలిచేది కేవలం మంచి AI మోడల్ తయారు చేసిన సంస్థ కాదు… దాన్ని నడిపించే అత్యంత శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలను నిర్మించిన సంస్థ.
అలాంటి అత్యంత కీలకమైన రంగంలో తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ఇంజినీర్ ఉదయ్ రుద్రరాజు. ఇటీవల xAI నుంచి OpenAIలోకి మారడంతో ప్రపంచ టెక్నాలజీ వర్గాల దృష్టి ఆయనపై పడింది.
అసలు ఉదయ్ రుద్రరాజు ఎవరు?
ఉదయ్ రుద్రరాజు కుటుంబ మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో ఉన్నాయి. ఆయన బాల్యం, చదువు మాత్రం హైదరాబాద్‌లో సాగాయి. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లంటే ఆసక్తి. అదే ఆసక్తి ఆయనను కంప్యూటర్ సైన్స్ వైపు నడిపించింది.
హైదరాబాద్‌లోని చైతన్య భారతీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉదయ్, విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు చేసి సాంకేతిక అనుభవాన్ని సంపాదించారు.
తర్వాత అమెరికాలోని University of Minnesotaలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, ప్రపంచ టెక్నాలజీ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఒక్కో అడుగుతో ఎదిగిన కెరీర్
మొదటి ఉద్యోగం eBayలో. అక్కడ భారీ స్థాయి సాఫ్ట్వేర్ వ్యవస్థలు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పనిచేశారు. తన సాంకేతిక నైపుణ్యంతో త్వరగానే గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ Robinhoodలో చేరి వందలాది మంది ఇంజినీర్ల టీమ్ కి నాయకత్వం వహించారు. కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించే ప్లాట్‌ఫారమ్‌ను మరింత వేగవంతంగా, స్థిరంగా తీర్చిదిద్దే బాధ్యతలు చేపట్టారు.
ఈ ప్రయాణమే ఆయన కెరీర్లో అతిపెద్ద మలుపుకు దారి తీసింది.
ఎలాన్ మస్క్ సంస్థలో కీలక పాత్ర
2024లో ఉదయ్ xAIలో చేరారు. ఇది సాధారణ ఉద్యోగ మార్పు కాదు. ప్రపంచ AI రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంజినీరింగ్ టీమ్ లో చోటు దక్కడం.
అక్కడ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన AI సూపర్ కంప్యూటర్లలో ఒకటిగా గుర్తింపు పొందిన Colossus నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. Grok వంటి AI మోడళ్ల శిక్షణకు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను అభివృద్ధి చేసే టీమ్ లో ఆయన పనిచేశారు.
ఇప్పుడు OpenAIలో కొత్త బాధ్యత
xAIలో ఆయన చేసిన పనితీరే ఇప్పుడు OpenAI దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ChatGPTతో ప్రపంచాన్ని మార్చేస్తున్న OpenAIలో, భవిష్యత్ AI మోడళ్లకు అవసరమైన భారీ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో ఉదయ్ రుద్రరాజు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచ AI రంగంలో అత్యంత విలువైన ప్రతిభ కోసం సంస్థలు పోటీ పడుతున్న ఈ సమయంలో, ఒక తెలుగు ఇంజినీర్‌ను రెండు అగ్రశ్రేణి AI సంస్థలు తమ ప్రయాణంలో భాగం చేసుకోవడం ఆయన సామర్థ్యానికి నిదర్శనం.
నేలను మర్చిపోని మనోడు
ప్రపంచ స్థాయి టెక్నాలజీ సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ, తన మూలాలను ఉదయ్ మరచిపోలేదు. స్వగ్రామం మహదేవపట్నంలోని పాఠశాల అభివృద్ధికి సహాయం చేయడం, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చేయూత ఇవ్వడం ద్వారా తన గ్రామంతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
ఇది ఒక్క వ్యక్తి కథ కాదు…
మహదేవపట్నం నుంచి హైదరాబాద్…హైదరాబాద్ నుంచి అమెరికా… అమెరికా నుంచి ప్రపంచ AI రంగంలో అత్యంత కీలకమైన స్థానానికి.
ఉదయ్ రుద్రరాజు ప్రయాణం ఒక విషయం చెబుతోంది. ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీని నిర్మించే ప్రతిభకు చిరునామా సిలికాన్ వ్యాలీ మాత్రమే కాదు… గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం కూడా కావచ్చు.








