ఆ రోజు ఆ రాయి భూమిపై పడకపోతే.. ఈ రోజు మనిషి అనే జాతే ఉండేది కాదు!
— సూర్య ప్రకాష్ జోశ్యుల
66 మిలియన్ సంవత్సరాల క్రితం…
ఆ రోజు కూడా భూమిపై జీవితం మామూలుగానే సాగుతోంది.
అడవుల్లో భారీ డైనోసార్లు సంచరిస్తున్నాయి. నదుల ఒడ్డున నీరు తాగుతున్నాయి. ఆకాశంలో ఎగిరే సరీసృపాలు రెక్కలు విప్పుతున్నాయి. కోట్ల ఏళ్లుగా ఈ భూమికి అవే ప్రభువులు. అయితే వాటికి తెలియదు. కొన్ని నిమిషాల్లోనే తమ జాతి చరిత్రలో చివరి అధ్యాయం ప్రారంభం కాబోతోందని.
హఠాత్తుగా…ఆకాశంలో ఒక అగ్నిగోళం కనిపించింది. క్షణక్షణాన అది పెద్దదవుతూ మరింత ప్రకాశవంతంగా మారుతూ , భూమి వైపు దూసుకొచ్చింది. ఆ తర్వాత ఆకాశంలో కనిపించిన ఆ అగ్నిగోళం క్షణాల్లోనే భూమిని ఢీకొట్టింది.
అది సాధారణ ఢీకొట్టడం కాదు. దాదాపు 10 కిలోమీటర్ల వెడల్పున్న గ్రహశకలం, గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం మెక్సికోలోని యుకటాన్ ద్వీపకల్పాన్ని ఢీకొట్టింది. ఆ క్షణంలో విడుదలైన శక్తి… కోట్ల అణుబాంబులు ఒకేసారి పేలినంత తీవ్రంగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా.
భూమి కంపించింది. వందల కిలోమీటర్ల మేర రాళ్లు, ధూళి, కరిగిన శకలాలు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఆ వేడి శకలాలు మళ్లీ భూమిపైకి వర్షంలా కురవడంతో ప్రపంచవ్యాప్తంగా అడవులు మంటల్లో చిక్కుకున్నాయి. సముద్రాల్లో వేల అడుగుల ఎత్తున సునామీలు ఎగిశాయి. భారీ భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు భూమిని మరింత అతలాకుతలం చేశాయి. అంతటితో ప్రమాదం ముగియలేదు.
వాతావరణంలోకి ఎగిరిన ధూళి, బూడిద, సూక్ష్మ కణాలు నెలలు, బహుశా సంవత్సరాల పాటు సూర్యకాంతిని అడ్డుకున్నాయి. భూమి ఒక్కసారిగా చల్లబడిపోయింది. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ చేయలేక చనిపోయాయి. మొక్కలపై ఆధారపడిన శాకాహార డైనోసార్లు ఆకలితో చనిపోయాయి. వాటిపై ఆధారపడిన మాంసాహార డైనోసార్లు కూడా క్రమంగా అంతరించిపోయాయి.
ఇవి కూడా చదవండి
ఒకే రోజు ప్రపంచం నాశనం కాలేదు. కానీ… ఒకే రోజు ప్రారంభమైన విపత్తు, కొన్ని వేల సంవత్సరాల్లో కోట్ల ఏళ్లుగా భూమిని ఏలిన డైనోసార్ల సామ్రాజ్యాన్ని పూర్తిగా చెరిపేసింది.
ఈ కథ మీకు ఇప్పటికే తెలుసు అనుకుంటున్నారు కదా? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ రోజు డైనోసార్లు అంతరించిపోవటం మాత్రమే జరగలేదు. ఆ రోజు మనిషి పుట్టుకకు తలుపు కూడా తెరుచుకుంది.
అదే 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఆ గ్రహశకలం భూమిని తప్పించి వెళ్లి ఉండి ఉంటే. డైనోసార్లు ఇప్పటికీ బతికే ఉండేవి. క్షీరదాలకు భూమిపై ఆధిపత్యం సాధించే అవకాశం వచ్చేది కాదు. పరిణామ క్రమం పూర్తిగా వేరే దిశలో వెళ్లేది. ఈ రోజు మీరు ఈ కథ చదివేవారు కాదు. నేను ఈ కథ రాసేవాడిని కాదు. ‘మనిషి’ అనే జాతి ఈ భూమిపై ఉండేదే కాదు.
అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ కథకు మరో సంచలన ట్విస్ట్ జోడించారు.
డైనోసార్లను అంతం చేసింది సాధారణ గ్రహశకలం కాదట. తాజాగా Science Advances జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, అది Carbonaceous Ornans (CO) అనే అత్యంత అరుదైన రకం ఉల్క. భూమిపై పడే కార్బనేషియస్ కాండ్రైట్ ఉల్కలే చాలా అరుదు. వాటిలో CO రకం అయితే మరింత అరుదు. అంటే కోట్లలో ఒకటిగా చెప్పదగ్గ రాయే భూమిని ఢీకొట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇన్నాళ్లూ డైనోసార్ల వినాశనానికి కారణం ఒక భారీ గ్రహశకలం అని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఆ గ్రహశకలం అసలు ఏ కుటుంబానికి చెందినదో కూడా గుర్తించారు.
అందుకోసం వారు డెన్మార్క్, స్పెయిన్, ఇటలీల్లోని 66 మిలియన్ సంవత్సరాల నాటి నమూనాలు సేకరించారు. వాటిలోని నికెల్ ఐసోటోపులను పరిశీలించి, భూమిపై దొరికిన వివిధ రకాల ఉల్కలతో పోల్చారు. ఆ ఫోరెన్సిక్ పరిశోధన చివరకు ఒకే విషయాన్ని చూపించింది. డైనోసార్ల జాతి మరణానికి కారణమైంది CO రకం అత్యంత అరుదైన ఉల్క. ఇదే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం.
డైనోసార్ల అంతం ఒక్క కారణంతో జరగలేదు. అత్యంత అరుదైన రాయి. సరిగ్గా అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఢీకొట్టడం. భారీ మొత్తంలో ధూళి, శకలాలు వాతావరణంలోకి ఎగరడం. సూర్యకాంతి భూమికి చేరకుండా పోవడం. ఆహార వ్యవస్థ పూర్తిగా కూలిపోవడం. ఈ సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగాయి. అందుకే కోట్ల ఏళ్లుగా భూమిని ఏలిన జీవులు కూడా ఒక్కసారి కోలుకోలేకపోయాయి.
ఆ రోజున ఆ డైనోసార్లు తమ ప్రపంచానికి తామే శాశ్వత పాలకులమని అనుకుని ఉండొచ్చు. కానీ… ఆకాశం నుంచి వచ్చిన ఒకే ఒక్క రాయి వారి చరిత్రనే తుడిచేసింది. ఈ రోజు మనం కూడా అదే ఆకాశం కింద జీవిస్తున్నాం. అందుకే శాస్త్రవేత్తలు గతాన్ని తవ్వుతున్నారు. డైనోసార్ల మరణానికి కారణమైన రాయిని వెతుకుతున్నారు. ఎందుకంటే రేపు అలాంటి మరో రాయి భూమి వైపు దూసుకొస్తే అది ఈ సారి భూమని ఏలుతున్న మనిషి కథకే చివరి అధ్యాయాన్ని రాసే ప్రమాదం ఉంది.








