క్షణకాలంలో మాయమయ్యే ఫాంటమ్ ట్విస్ట్.. అత్యాధుని డ్రోన్ ఇది..!
ప్రస్తుతం అంతా డ్రోన్ మయం.. దీనికి ఏఐ టెక్నాలజీ తోడవుతోంది. దీంతో అత్యాధునిక, నమ్మశక్యం గానీ నూతన టెక్నాలజీలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇందులో లేటెస్టుగా తయారైంది ఫాంటమ్ ట్విస్ట్. అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ఇంజనీర్లు దీనికి భిన్నంగా ఆలోచించి ఒక కొత్తరకం డ్రోన్‌ను ఆవిష్కరించారు.ఇది గాల్లో అత్యంత వేగంగా తన చుట్టూ తాను తిరుగుతూ కంటికి కనిపించకుండా మాయమవుతుంది. సెకనుకు 25 సార్లు తిరగడం వల్ల, మన కళ్ళు దాని కదలికలను గుర్తించలేవు. దీంతో ఆ డ్రోన్ స్పష్టంగా కనిపించకుండా కేవలం ఒక మసక నీడలా మాత్రమే కనిపిస్తుంది.
ఈ వినూత్న ఆవిష్కరణ వెనుక ఉన్న సాంకేతికతను నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎమ్మా అలెగ్జాండర్ వివరించారు. “ఒక కెమెరాకు ఎక్స్పోజర్ టైమ్ ఉన్నట్టే, మన కన్ను కూడా ఒక దృశ్యాన్ని పూర్తిగా గ్రహించడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఫాంటమ్ ట్విస్ట్ డ్రోన్ అత్యంత వేగంగా తిరగడం వల్ల దానిలోని భాగాలన్నీ కలిసిపోయి ఒకటే మసకగా కనిపిస్తాయి. దీంతో పరిసరాల్లో వచ్చిన చిన్న మార్పును ఎవరూ అంత సులభంగా గమనించలేరు” అని ఆమె తెలిపారు.
సాధారణంగా నాలుగు రెక్కలుండే క్వాడ్‌కాప్టర్ డ్రోన్లలో బాడీ స్థిరంగా ఉండి, కేవలం ప్రొపెల్లర్లు మాత్రమే తిరుగుతాయి. కానీ, ఫాంటమ్ ట్విస్ట్‌కు ఒకే మోటార్, ఒకే ప్రొపెల్లర్ ఉంటాయి. ప్రొపెల్లర్ తిరిగే దిశకు వ్యతిరేక దిశలో డ్రోన్ బాడీ మొత్తం వేగంగా తిరుగుతుంది. ఈ మోషన్ బ్లర్ కారణంగా అది దాదాపుగా అదృశ్యమైనట్టు అనిపిస్తుంది.
ఈ డ్రోన్ ఆకారాన్ని చేతితో డిజైన్ చేయలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిలో దీన్ని రూపొందించారు. ముందుగా లక్షలాది డిజైన్లను ఏఐ ద్వారా జనరేట్ చేసి, వాటిలో గాల్లో ఎగరగల సామర్థ్యమున్న 20,000 డిజైన్లను ఫిల్టర్ చేశారు. చివరకు అత్యంత సమర్థవంతమైన డిజైన్‌ను ఎంపిక చేసి, దాన్ని నిర్మించారు. అరచేతిలో ఇమిడిపోయే ఈ డ్రోన్ బరువు కేవలం 30 గ్రాములు మాత్రమే. సాధారణ క్వాడ్‌కాప్టర్‌తో పోలిస్తే, ఇది కంటికి కనిపించే అవకాశం 10 రెట్లు తక్కువని పరిశోధకులు చెబుతున్నారు.
ఫాంటమ్ ట్విస్ట్ పూర్తిగా అదృశ్యం కానప్పటికీ, వీడియోలో ఒక దెయ్యం నీడలా (ghostly smudge) కనిపిస్తుంది. అయితే, స్థిరంగా ఉంటూ వెంటనే దృష్టిని ఆకర్షించే సాధారణ డ్రోన్లతో పోలిస్తే, దీని కదలికలను గుర్తించడం చాలా కష్టం. ముఖ్యంగా, ఒక్క క్షణం పక్కకు చూసి మళ్ళీ చూస్తే దాన్ని కనిపెట్టడం అసాధ్యం. ఈ పరిశోధన వివరాలను సిడ్నీలో జరిగిన ‘రోబోటిక్స్: సైన్స్ అండ్ సిస్టమ్స్ 2026’ సదస్సులో ప్రజెంట్ చేశారు.








