మరోసారి అమెరికా టారిఫ్ ల బాదుడు..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచదేశాలకు షాకిచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చే షాక్‌ల నుంచి తప్పించుకుంటూ, స్థానిక అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే ధ్యేయంగా ట్రంప్ సర్కార్ సరికొత్త ‘టారిఫ్ అస్త్రాన్ని’ ప్రయోగించింది. వెట్టిచాకిరీ ద్వారా తయారయ్యే ఉత్పత్తుల దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించడంలో విఫలమయ్యారనే నెపంతో భారత్, చైనా, బ్రిటన్ సహా దాదాపు 60కి పైగా ప్రపంచ భాగస్వామ్య దేశాలపై 10 శాతం నుండి 12.5 శాతం వరకు కొత్త దిగుమతి సుంకాలను విధిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ట్రేడ్ యాక్ట్ 1974 లోని ‘సెక్షన్ 301’ ప్రకారం ఈ కఠినమైన సుంకాలను అమల్లోకి తెచ్చారు.
వెట్టిచాకిరీ ఉత్పత్తులపై ఎలాంటి చట్టపరమైన నిషేధాలు లేని చైనా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలకు చెందిన దిగుమతులపై గరిష్ఠంగా 12.5 శాతం పన్ను భారం వేయగా.. చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో వెనుకబడిన భారత్, శ్రీలంక, యూరోపియన్ యూనియన్ (ఈయూ) వంటి దేశాల ఉత్పత్తులపై 10 శాతం పన్ను నిర్ణయించారు. నిజానికి భారత్‌పై కూడా 12.5 శాతం పెనాల్టీ టారిఫ్ విధిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ఇటీవలి కాలంలో భారత్ చేపట్టిన నియంత్రణ చర్యలను గుర్తించిన అమెరికా వాణిజ్య ప్రతినిధి శ్రేణి.. భారత్‌పై సుంకాన్ని 10 శాతానికే పరిమితం చేసింది. అయితే చమురు, గ్యాస్, యూఎస్ఎంసీఏ ఒప్పందం పరిధిలోని నిత్యావసరాలకు ఈ టారిఫింగ్ నుండి మినహాయింపు లభించింది. భవిష్యత్తులో మితిమీరిన తయారీ సబ్సిడీలు ఇచ్చే దేశాలపై మరిన్ని సుంకాలు విధించేందుకు ట్రంప్ బృందం వ్యూహాలు రచిస్తోంది.
భారత్‌కు ఊరట..
ప్రారంభంలో భారత్‌పై 12.5 శాతం టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ.. వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10 శాతానికి తగ్గించారు. చమురు, సహజ వాయువు, ఎరువుల దిగుమతులకు, అలాగే యూఎస్-మెక్సికో-కెనడా వాణిజ్య ఒప్పందం పరిధిలోకి వచ్చే వస్తువులకు ఈ పన్నుల నుంచి మినహాయింపు ఇచ్చారు.
అయితే, మునుపటి సుంకాల గడువు ముగిసే సమయానికే సరిగ్గా ఈ కొత్త సుంకాలను తీసుకురావడంపై వస్తున్న విమర్శలను అమెరికా అధికార యంత్రాంగం తోసిపుచ్చింది. ట్రంప్ తన వ్యాపార విధాన లక్ష్యాలను సాధించడానికి తన వద్ద ఉన్న అన్ని సాధనాలను ఎప్పుడూ ఉపయోగిస్తారని తెలిపింది. అందులో సుంకాలు కూడా ఒక భాగమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఆయా దేశాలతో కుదుర్చుకున్న గరిష్ఠ సుంకాల పరిమితిని దాటి ఈ నూతన సుంకాలు పెరగవని పేర్కొంది.
ఇవి కూడా చదవండి








