పేపర్ లీకేజీ చేస్తే.. పదేళ్ల జైలు, రూ.10 కోట్ల వరకు జరిమానా
పేపర్ లీకేజీ విషయంలో మోదీ ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. లీక్ కి పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రశ్నా పత్రాల లీకేజీ ఘటనలో దోషులకు 10 సంవత్సరాల వరకూ జైలు శిక్ష, 10 కోట్ల వరకూ జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించారు. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దీనిని కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత గ్యాంగ్‌లు, నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024’ చట్టానికి సవరణలు చేసేందుకు ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇందులో భాగంగా పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన కేంద్రం, అక్రమాలకు పాల్పడేవారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించేలా కఠిన నిబంధనలను పొందుపరిచింది.
అంతేకాకుండా, ఈ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు చట్టబద్ధత కలిగిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేవలం కేసు నమోదు, దర్యాప్తు ప్రక్రియలకే పరిమితం కాకుండా, విచారణను ప్రారంభించిన 3 నెలల్లోనే తుది తీర్పు వెలువడేలా నూతన చట్టంలో స్పష్టమైన నిబంధనలను చేర్చింది.
2024 నాటి ప్రవేశ పరీక్షల చట్టానికి కేంద్రం కీలక సవరణల చేసింది. ప్రస్తుతం ఈ చట్టం కింద ప్రశ్నా పత్రాల లీకేజీకి పాల్పడిన వ్యక్తిగత కేసుల్లో దోషులకు 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల వరకూ జరిమానా విధిస్తున్నారు. ఈ శిక్షలు, జరిమానాలను భారీగా పెంచుతూ మోదీ ప్రభుత్వం ఇప్పుడు చట్టాన్ని సవరించింది.








