ఇక స్వదేశీ టర్పోజెట్ ఇంజిన్.. అంతరిక్షరంగంలో భారత్ మరో మైలురాయి..!
రక్షణరంగంలో భారత్ అప్రతిహతంగా పురోగమిస్తోంది. ఎప్పటికప్పుడు అడ్డంకులు వస్తున్నా.. శాస్త్రవేత్తల అకుంఠిత దీక్షతో వాటిని అధిగమిస్తూ ముందుకు పోతోంది. దీనిలో భాగంగా దశాబ్దాలుగా ఊరిస్తున్న టర్బోజెట్ ఇంజిన్ తయారీలోనూ విజయం సాధించింది. దీంతో..రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధన దిశగా దేశం ఒక చారిత్రక మైలురాయిని అధిగమించినట్లైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ‘ఎక్స్పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్’ విజయవంతంగా ఆవిష్కృతమైంది. 350 కేజీల థ్రస్ట్ క్లాస్‌కు చెందిన ఈ ఇంజిన్‌ను క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాల (యూఏవీ) తయారీలో భారత్ స్వావలంబనకు కీలక మలుపుగా పరిగణిస్తున్నారు.
బెంగళూరులోని డీఆర్డీఓ అనుబంధ సంస్థ ‘గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్’ (జీటీఆర్‌ఈ) ఈ ఇంజిన్‌ను డిజైన్ చేయగా, హైదరాబాద్‌కు చెందిన ‘ఆజాద్ ఇంజినీరింగ్’ సంస్థ ఇండస్ట్రీ పార్ట్నర్గా దీనిని నిర్మించి, అసెంబుల్ చేసింది. కేవలం 24 నెలల స్వల్ప వ్యవధిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన ఆజాద్ ఇంజినీరింగ్, జులై 22న ఈ ఇంజిన్‌ను డీఆర్డీఓ ఉన్నతాధికారులకు అందజేసింది.
అత్యంత సంక్లిష్టమైన జెట్ ఇంజిన్ సాంకేతికత ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ ఘనత సాధించడం ఏరోస్పేస్ ప్రొపల్షన్ రంగంలో స్వయం సమృద్ధికి నాందిగా నిలవనుంది. ఈ రకమైన ఇంజిన్లను ప్రధానంగా యాంటీ షిప్ మిస్సైల్స్ , యాంటీ డ్రోన్ సిస్టమ్స్ మరియు యూఏవీలలో విస్తృతంగా వినియోగించనున్నారు.
ఈ చారిత్రక విజయంపై డీఆర్డీఓ చైర్మన్ మరియు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ.. జీటీఆర్‌ఈ, ఆజాద్ ఇంజినీరింగ్ బృందాలను అభినందించారు. డీఆర్డీఓ మరియు ప్రైవేట్ పరిశ్రమల మధ్య సమన్వయంతో కూడిన బలమైన భాగస్వామ్యానికి ఇది ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు.








