కర్నాటకపై కన్నేసిన మల్లారెడ్డి కుటుంబం!
తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలితో, సంచలన వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలిచే గులాబీ పార్టీ కీలక నేత, మేడ్చల్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గులాబీ గూటికి దూరమవుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో, ఈ కుటుంబం తమ భవిష్యత్తు రాజకీయం కోసం వేస్తున్న అడుగులు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల్లో బలమైన పట్టున్న మల్లారెడ్డి కుటుంబం తెలంగాణ నుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుందని అంతా భావించారు. మల్కాజిగిరి ఎంపీ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను తమకు అప్పగించాలని, తామే గెలిపించుకుంటామనే ప్రతిపాదన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఇక్కడే సరికొత్త ట్విస్ట్ నెలకొంది. తమ కుటుంబ మూలాలు ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రీతి రెడ్డి ఎంపీగా పోటీ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాబోయే రోజుల్లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన, అలాగే మహిళా రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక కీలక లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బిజెపి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత మల్లారెడ్డి వ్యూహాత్మక అడుగులు వేయడం ప్రారంభించారు. తొలుత ఆయన బెంగళూరు పర్యటనకు వెళ్ళి, కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డి.కె. శివకుమార్‌ను కలవడం తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత పరిణామాల్లో మల్లారెడ్డి కుటుంబం ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం, మరొకవైపు ప్రీతి రెడ్డి తెలంగాణ బిజెపి అగ్రనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చింది.
మరొకవైపు గులాబీ పార్టీతో ఆయన బంధం దాదాపు తెగిపోయినట్లేనని శ్రేణులు భావిస్తున్నాయి. మేడ్చల్ లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించినప్పటికీ, వేదికపై ఉన్న మల్లారెడ్డి మౌనం వహించడం సొంత పార్టీ నాయకులకు, శ్రేణులకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు, సమావేశాలకు ఆయన పూర్తిగా దూరంగా ఉంటుండటం ఈ ఊహాగానాలకు మరింత ఊతాన్నిస్తోంది.
గతంలోనే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రీతి రెడ్డి భావించారు. అయితే, ఆ సమయంలో పార్టీ అధిష్టానం నుంచి సరైన ప్రోత్సాహం, సానుకూల సంకేతాలు రాకపోవడంతో ఆమె వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రస్తుతం మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు.
అన్నీ అనుకున్నట్టు జరిగితే, ప్రీతి రెడ్డి సరిహద్దులు దాటి కర్ణాటక నుంచి బిజెపి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారు. అదే సమయంలో మల్కాజిగిరి ప్రాంతంలో తమ పట్టును నిలుపుకోవడానికి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి చెరొక దారి ఎంచుకోనున్నారు. ఒకరు మేడ్చల్ లేదా మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేగా, మరొకరు మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దు నియోజకవర్గాల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.








