ఇందిరమ్మ టవర్స్.. కాంగ్రెస్ ‘గ్రేటర్’ స్కెచ్!
హైదరాబాద్‌లోని పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు అనేది దశాబ్దాల స్వప్నం. ఆ కలను సాకారం చేస్తామంటూ వచ్చే ప్రతి హామీ, చివరకు రాజకీయ లబ్ధికి సాధనంగా మారుతోందనే విమర్శలు మళ్లీ ముదురుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ టవర్స్ పథకం ఇప్పుడు నగర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రకటించి, లక్షలాది దరఖాస్తులు స్వీకరించింది. కానీ, చివరకు ఆశావహులకు నిరాశే మిగిలింది. నగరం వెలుపల 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన అరకొర ఇళ్లతో సరిపెట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మార్కు ఫార్ములానే కాస్త భిన్నంగా మార్చి అమల్లోకి తెస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నగర నడిబొడ్డున 40 లక్షల నుంచి 60 లక్షల విలువైన ఫ్లాట్లను, లబ్ధిదారుల భాగస్వామ్యంతో కేవలం 6 లక్షలకే అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో 5 లక్షల వరకు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని తెలిపింది. ప్రత్యేక రిజర్వేషన్లు, మీ-సేవా కేంద్రాలు, వాట్సాప్ నంబర్ల ద్వారా దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే, ఉచితం అనే బదులు భాగస్వామ్యం అని పేరు మార్చినా.. అసలు లక్ష్యం మాత్రం ఎన్నికల్లో పొందే రాజకీయ ప్రయోజనమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తొలి విడతగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఇందిరమ్మ టవర్లను నిర్మిస్తామని ప్రకటించినప్పటికీ, ఈ ప్రాజెక్టులకు అవసరమైన విలువైన స్థలాలు ఎక్కడున్నాయనే దానిపై స్పష్టత కొరవడింది. నగర నడిబొడ్డున మౌలిక వసతులతో కూడిన భూములు అందుబాటులో ఉన్నాయా? అనే దానిపై క్లారిటీ లేదు. దరఖాస్తుల సేకరణే ప్రాధాన్యంగా సాగుతోంది తప్ప, నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయో స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేదు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఎంతవరకు ఉంటుందనేదానిపైన అనేక సందేహాలున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ నేతలు విష ప్రచారం అని కొట్టిపారేస్తున్నప్పటికీ, గత ప్రభుత్వాలు చేసిన పాత తప్పులనే మళ్లీ పునరావృతం చేస్తున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వేలాది డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటికీ పేదలకు పంపిణీ కాకుండా మూలనపడ్డాయి. కొన్ని చోట్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉంటే, మరికొన్ని చోట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. ఆ పాత ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం పక్కనబెట్టి, కొత్తగా ఇందిరమ్మ టవర్స్ అంటూ సరికొత్త హామీని తెరపైకి తేవడం వెనుక ఎన్నికల వ్యూహాలే ప్రాధాన్యం వహిస్తున్నాయని స్పష్టమవుతోంది.
సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో మీ-సేవ కేంద్రాల ముందు క్యూ కడుతున్న పేదలకు ఈసారి నిజంగానే నీడ దొరుకుతుందా, లేక ఇది కూడా ఎన్నికల ప్రచారాల హోరుతో ముగిసే మరో పొలిటికల్ గిమ్మిక్గా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.








