మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబానికి హైకోర్ట్ షాక్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni Sitaram) కుటుంబానికి భూకబ్జా కేసులో చట్టపరమైన చిక్కులు మరింత ముదిరాయి. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాపరం గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు రూ.4 కోట్ల విలువైన 900 గజాల ప్రైవేటు స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేశారనే ఆరోపణలపై తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, మరియు కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్లపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అరెస్ట్ భయంతో తమ్మినేని కుటుంబ సభ్యులు ఆమదాలవలసలోని తమ నివాసం నుండి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు నుంచి ఉపశమనం పొందడానికి, తమపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) ను కొట్టేయాలంటూ తమ్మినేని కుటుంబం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ వై. లక్ష్మణరావు ధర్మాసనం తమ్మినేని అభ్యర్థనను పూర్తిగా తోసిపుచ్చింది.
ఈ కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఇలాంటి సమయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ అరెస్ట్ నుండి మధ్యంతర రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఒకవేళ అరెస్ట్ అవుతామనే ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ (యాంటిసిపేటరీ బెయిల్) కోసం దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. హైకోర్టు సూచనల మేరకు తమ్మినేని సీతారాం తరఫు న్యాయవాదులు అత్యవసరంగా ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో ఇరువర్గాల సుదీర్ఘ వాదనలు జరిగాయి.
నిందితులు బతికున్న భూయజమాని చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం, ఫోర్జరీ వారసత్వ పత్రాలు సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే డాక్యుమెంట్ రైటర్, సబ్ రిజిస్ట్రార్ సహా 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తమ్మినేని కుటుంబ ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పును రిజర్వ్ చేస్తూ, ఈ నెల 27కి (జూలై 27) వాయిదా వేసింది.








