మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, జూలై 23: ప్రక్షాళన-విముక్తి-భద్రత అంశాలుగా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ల్యాండ్ లిటిగేషన్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. దీనికి అనుగుణంగానే భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్టును తెచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టును వర్చువల్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ మేరకు ఈ ప్రాజెక్టులో ఉన్న ఫీచర్స్, ప్రత్యేకతలను సీఎస్ సాయి ప్రసాద్, రెవెన్యూ శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు బ్లాక్‌చెయిన్ విధానాన్ని రెవెన్యూ శాఖ రూపొందించినట్టు తెలిపారు. భవిష్యత్తులో భూ సమస్యలకు చెక్ పెట్టేలా… ప్రతీ ల్యాండ్ పార్సెల్‌కు ప్రత్యేక డిజిటల్ ఐడీ ఇచ్చి ట్యాంపర్-ప్రూఫ్, సెక్యూరిటీతో లావాదేవీలు జరిగేలా బ్లాక్ చెయిన్ వ్యవస్థను తీర్చిదిద్దినట్టు వెల్లడించారు. ఇక భూ సమస్యలు ఉత్పన్నం కావడానికి డబుల్ రిజిస్ట్రేషన్లు ప్రధాన కారణంగా ఉన్నాయని… ఇకపై డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యలను నివారించేలా బ్లాక్ చెయిన్ విధానం పని చేస్తోందని అధికారులు వివరించారు.
భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్‌గా ఉండేలా మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చామని… రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ల శాఖలను ఒకే వేదిక మీదకు తెచ్చేలా ప్రాజెక్ట్ డిజైన్ చేశామని తెలిపారు. NIC ఆంధ్రప్రదేశ్, NIC బెంగళూరులోని సెంటరాఫ్ ఎక్స్ లైన్స్ ఇన్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ టెక్నాలజీతో మీ భూమి-బ్లాక్ చెయిన్ వ్యవస్థను అభివృద్ధి చేసినట్టు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టును కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పు గోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని ఒక్కో మండలంలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. దీంట్లో భాగంగా ఆస్పరి, పెనుమూరు, రేపల్లె, గన్నవరం, కడియం, గుమ్మలక్ష్మీపురం, కొత్తవలస మండలాల పరిధిలోని 89 రీ-సర్వే గ్రామాల్లోని 1,37,763 ల్యాండ్ పార్సెల్ మ్యాప్‌లు కవర్ చేసేలా మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేయనున్నట్టు వివరించారు. మీ భూమి-బ్లాక్ చెయిన్ అమలు జరిగే తీరును వివరించే వీడియోను అధికారులు ప్రజెంట్ చేశారు. ఇదే విధానంలో క్యూ ఆర్ కోడ్, ఆధార్ ను అనుసంధానించేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు.
అధ్యయనం చేయాలి… లోపాలు సరిదిద్దాలి
మీ భూమి-బ్లాక్ చెయిన్ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”భూ రికార్డులు సరిగా లేకపోవడం వల్ల విలువైన భూముల విషయంలో మోసాలు జరుగుతున్నాయి. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ల్యాండ్ లిటిగేషన్లు తక్కువే. కానీ గత ప్రభుత్వ విధానం వల్ల ఏపీలోనూ భూ తగాదాలు… వివాదాలు పెరిగాయి. 22ఏ పేరుతో కక్ష సాధింపులకు పాల్పడ్డారు. ప్రక్షాళన, విముక్తి, భద్రత వంటి అంశాలపై దృష్టి సారించి భూ సమస్యలను పరిష్కరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేపడుతున్నాం.. రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం… పట్టాదార్ పాస్ పుస్తకాలు రాజముద్ర వేసి ఇస్తున్నాం. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుటుపల్లి వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములకు విముక్తి కల్పించాం. ఇప్పుడు ప్రారంభించిన మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్టు ద్వారా భూములకు శాశ్వత భద్రత దక్కుతుంది. భూ రికార్డులకు సంబంధించి ట్యాంపర్ ప్రూఫ్ వ్యవస్థను తెస్తున్నాం.. పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాం.
బ్లాక్ చెయిన్ ద్వారా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలు ఒకే వేదిక మీదకు వస్తాయి… ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. రెండు నెలల పాటు ఈ పైలెట్ ప్రాజెక్టు అమలును పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. ఈ వ్యవస్థ అమల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని నమోదు చేసుకోవడానికి ఓ కంప్లైంట్ సెల్ పెట్టాలి… దానికి అనుగుణంగా బ్లాక్ చెయిన్ ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి సర్వే పూర్తి అయిన గ్రామాలు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వ్యవస్థలోకి వెళ్తాయి. నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ భూమి-బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా చూడాలి. భూ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేలా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భూ సమస్యలకు పరిష్కారం చూపితే ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.”అని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీఎస్ సాయి ప్రసాద్, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఏడు జిల్లాల కలెక్టర్లు, ఏపీ-ఎన్ఐసీ, బెంగళూరు-ఎన్ఐసీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.








