లీకేజీ బాధ్యులకు శిక్షపడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు : ప్రధాని కీలక ప్రకటన…
నీట్ పేపర్ లీకేజీ, సీజేపీ నిరసనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన శిక్షపడేలా చూస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు. యువత భవిష్యత్తుకు హాని చేయాలని చూసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని, వారి సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం అని ప్రకటించారు.
విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది కొనసాగింపు అని అన్నారు. పేపర్ లీకేజీ బాధ్యులకు శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నిర్ణయించామని ఎక్స్ వేదికగా ప్రకటించారు.
రాహుల్ గాంధీ కౌంటర్…
ప్రధాని మోదీ ప్రకటన వెలువడిన వెంటనే రాహుల్ గాంధీ ‘X’ వేదికగా ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతోందన్న ప్రధాని మాటలను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ‘మన దేశ యువత భవిష్యత్తుకు అతిపెద్ద ద్రోహం చేసి, దానిని నాశనం చేసింది మీరే’ అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ విద్యావ్యవస్థను పూర్తిగా దిగజారిపోయేలా, కొద్దిమంది చేతుల్లో బందీ అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించిందని, బాధ్యులందరినీ ఈ ప్రభుత్వమే వెనకేసుకొచ్చిందని ఆయన విమర్శించారు.








