భారత్‌లో తొలి ‘డెంగీ నివారణ టీకా’ రెడీ..!
ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారిన డెంగీ మహమ్మారి నివారణకు భారత్ లో సరికొత్త ఆయుధం అందుబాటు లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి డెంగీ నివారణ వ్యాక్సిన్ ‘క్యుడెంగా’ (Qdenga) విడుదలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ వ్యాక్సిన్‌ను జపాన్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ ‘తకేడా’ (Takeda) అభివృద్ధి చేసింది. డెంగీ నివారణ కోసం మన దేశంలో డీసీజీఐ ఆమోదం పొందిన తొలి టీకా ఇదే కావడం గమనార్హం.
తకేడా బయో ఫార్మాస్యూటికల్స్ ఇండియా అందించిన వివరాల ప్రకారం, 4 సంవత్సరాల వయస్సు నుండి 60 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారందరూ ఈ ‘క్యుడెంగా’ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. ముఖ్యంగా, గతంలో డెంగీ బారిన పడిన వారైనా లేదా అసలు డెంగీ సోకని వారైనా సరే.. ఎవరైనా ఈ టీకాను నిర్భయంగా తీసుకోవచ్చు. సాధారణంగా కొన్ని రకాల వ్యాక్సిన్లు ఇచ్చే ముందు రక్తం లేదా ఇతర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ క్యుడెంగా టీకా తీసుకోవడానికి ఎటువంటి ముందస్తు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.
మూడు నెలల కాల వ్యవధిలో 0.5 మి.లీ. చొప్పున రెండు మోతాదుల్లో (2 డోసులు) ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడించారు. డెంగీ వైరస్‌లో ఉన్న నాలుగు రకాల వేరియంట్లు (సెరోటైప్స్) పై ఈ వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతంగా పనిచేసి, దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న డెంగీ కేసుల్లో దాదాపు మూడో వంతు భారత్‌లోనే ఉంటున్న నేపథ్యంలో, ఈ టీకా రాకతో డెంగీ కారణంగా ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య భారీగా తగ్గుతుందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే 40కి పైగా దేశాల్లో ఆమోదం పొందిన ఈ క్యుడెంగా వ్యాక్సిన్, ఇప్పుడు భారత మార్కెట్లోకి రావడం ప్రజారోగ్య రక్షణలో ఒక మైలురాయిగా నిలవనుంది.








