అఖిల పక్ష సమావేశాన్ని వాకౌట్ చేసి నిరసన వ్యక్తం చేసిన విపక్షాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆదివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. అయితే.. సమావేశం ప్రారంభమైన కాసేపటికే కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్ వాదీ, డీఎంకే, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన యూబీటీ, ఆప్, లెఫ్ట్ పార్టీలు వాకౌట్ చేసేశాయి. వాకౌట్ చేయడం ద్వారా తమ నిరసనను తెలియజేశాయి.
మరో వైపు పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కేంద్రం కోరింది. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ మేఘవాల్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అయితే, ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తిరుగుబాటు ఎంపీలకు ఆహ్వానం ఇవ్వడాన్ని ఆ పార్టీ నిరసించింది. దీంతో ఇండియా కూటమి పార్టీల నేతలు వాకౌట్ చేశారు.
అఖిలపక్ష సమావేశానికి టీఎంసీ తిరుగుబాటు ఎంపీలను ఆహ్వానించడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. లోక్‌సభలో వారికి ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేయడం, స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్లు ఇంకా పెండింగ్‌లో ఉండగానే వారికి గుర్తింపు కల్పించేలా వ్యవహరించడంపై మండిపడ్డాయి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించాయి. ఈ సందర్భంగా శివసేన(యూబీటీ) తిరుగుబాటు ఎంపీల విలీన అంశాన్నీ విపక్షాల నేతలు ప్రస్తావించారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ.. అధికారికంగా గుర్తింపు లేని ఎన్సీపీఐ పేరుతో ఉన్న తిరుగుబాటు ఎంపీలను ఏ ప్రాతిపదికన సమావేశానికి పిలిచారని ప్రశ్నించారు. వారిపై ఉన్న అనర్హత పిటిషన్లు ఇంకా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, రాజ్యాంగ సవరణల ప్రకారం ప్రత్యేక బ్లాక్‌కు అవకాశం లేదని పేర్కొన్నారు. ఈ చర్యకు నిరసనగానే ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేశాయని చెప్పారు.








