అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర.. ‘‘విక్రమ్-1’’ ప్రయోగం సక్సెస్.. ప్రత్యేకతలివే…
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ ‘‘స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ ‘‘విక్రమ్-1’’ శనివారం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 12:05 గంటలకు ఈ ప్రయోగం చేపట్టారు, విజయవంతం అయ్యింది. ఇందులోని ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
నిజానికి ఉదయం 11:30 గంటలకు ప్రయోగం జరగాల్సి వుండింది. సాంకేతిక లోపం వచ్చింది. దీంతో తాత్కాలికంగా నిలిపేసి, శాస్త్రవేత్తలు పరిశీలన చేశారు. ఇంధన ప్రక్రియలో లోపం వున్నట్లు గుర్తించి, సరిచేశారు. ఆ తర్వాత సరిగ్గా 35 నిమిషాల తర్వాత రాకెట్ ను ప్రయోగించగా, 20 నిమిషాల తర్వాత రాకెట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.
‘‘మిషన్ ఆగమన్ పేరుతో’’
మిషన్ ఆగమన్ పేరుతో స్కైరూట్ ఈ ప్రయోగం చేపట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మిషన కి ఈ పేరు పెట్టారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి తద్వారా కీలక సమాచారం రాబట్టనున్నారు. దీంతో రానున్న కాలంలో వాణిజ్య ప్రయోగాల అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా స్కైరూట్ ముందడుగేస్తోంది.
ఇక.. సుమారు ఏడంతస్తుల భవనం ఎత్తులో రూపొందిన విక్రమ్-1 పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో తయారైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్లు, ఘన ఇంధన బూస్టర్లతో పనిచేసే ఈ రాకెట్ 350 కిలోల వరకు చిన్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని లోఎర్త్ ఆర్బిట్(LEO)లో ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంది.








