తెలంగాణలో నోటిఫికేషన్లు లేవు .. లూటిఫికేషన్లే : కేటీఆర్
యువ గళాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి, ఇప్పటిదాక ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడారు. యుత్ డిక్లరేషన్ పేరిట మోసం చేసిన కాంగ్రెస్ (Congress) నేతలకు డెత్ డిక్లరేషన్ ఇవ్వాలని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వేల మంది విద్యార్థులను చంపిన పార్టీ కాంగ్రెస్. జిత్తులమారి నక్కలాంటి కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసింది. యువతరంతో పెట్టుకుంటే తరాలపాటు పుట్టగతులు లేకుండా పోతారు. యÖత్ డిక్లరేషన్‌లో రాహుల్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. తెలంగాణలో నోటిఫికేషన్లు లేవు. లూటిఫికేషన్లే. యువతకు జాబులు లేవు, రాహుల్‌గాంధీ (Rahul Gandhi) జేబులే నిండుతున్నాయి అని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేవరకు విశ్రమించనని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటున్నారు. రేవంత్‌కు పదవి ఇచ్చింది యువతకు జాబులు ఇచ్చేందుకా? రాహుల్‌కు జాబ్ ఇచ్చేందుకా? తెలుగు, ఇంగ్లీష్ క్యాలెండర్లు మారాయి కానీ, జాబ్ క్యాలెండర్ మాత్రం మారట్లేదు. అసెంబ్లీలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌ను చిత్తు కాగితంతో సమానం చేశారు. జంగ్ సైరన్ మోగించడానికి నేడు యువతరం కదిలివచ్చింది. రేవంత్ రెడ్డి క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది అని హెచ్చరించారు.








