ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసిన సెయింట్ లూయిస్.. ముగిసిన రుద్రయాగం మూడో రోజు వేడుకలు!
అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో ఉన్న ‘ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్’లో జరుగుతున్న నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం మూడో రోజు అత్యంత ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగింది. వేద మంత్రోచ్చారణలు, పవిత్ర హోమ గుండాల మధ్య యాగశాల అంతా భక్తిభావంతో నిండిపోయింది. అమెరికాలో ఇలాంటి మహాయజ్ఞం జరగడం పట్ల భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మూడో రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు:
గోమాత పూజతో వేడుకలు మొదలయ్యాయి. అనంతరం రుత్వికులు మహాన్యాస పారాయణం , రుద్రహోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం వేళ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం, ఆరోగ్యం , సానుకూల శక్తి కోసం ప్రత్యేకంగా అరుణ హోమాన్ని జరిపారు.
సాయంత్రం జగన్మాత చండికాదేవి అనుగ్రహం, ధర్మరక్షణ , శత్రుబాధల నివారణ కోరుతూ చండీ హోమం నిర్వహించారు. ఇందులో కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మూడో రోజు ఈ హోమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విద్య, జ్ఞానం, కళలు , నాయకత్వ లక్షణాల కోసం రాజశ్యామలాదేవికి అంకితం చేసిన ఈ హోమంలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ప్రత్యేక సంకల్పాలతో పాల్గొన్నారు.
ఈ మహాయజ్ఞం జూలై 19 వరకు కొనసాగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్ తెలిపారు. కమిటీ ఉపాధ్యక్షుడు సాక్షి విజయ్, కార్యదర్శి జంగా కిషోర్, కోశాధికారి పుట్టగుంట మురళీ, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బైరపునేని సురేంద్రనాథ్ , మీడియా సమన్వయకర్త రాజా సూరపనేని మాట్లాడుతూ, మిగిలిన రోజుల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి, పరమేశ్వరుడి ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ, అన్నప్రసాద వితరణ భక్తిపూర్వకంగా జరిగింది.








