స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ పై.. మంత్రి మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కీలక వ్యాఖ్యలు చేశారు. తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024లో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీసుకున్న నిర్ణయమని, అప్పటి పరిస్థితిని బట్టి ఒక అడుగు వెనక్కు తగ్గామని అధినేత చెప్పారన్నారు. అప్పుడు వర్తించిన ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉంటుందని వచ్చిన వార్తలు సరికాదని స్పష్టం చేశారు. ఎన్డీయే (NDA) కూటమి సమావేశంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను బట్టి ఎవరికి ఎన్ని అనేది నిర్ణయం ఉంటుందని వివరించారు. కూటమి బలోపేతమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. జనసేన (Janasena)లో కష్టపడి పనిచేసే వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు.








