కూటమికి ‘స్థానిక’ పరీక్ష.. సవాల్ గా పొత్తుల సర్దుబాటు..?
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ)కి సరికొత్త రాజకీయ సవాల్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయంతో అధికారాన్ని కైవసం చేసుకున్న ఈ మూడు పార్టీలకు, క్షేత్రస్థాయిలో జరిగే స్థానిక పోరులో సీట్ల సర్దుబాటు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గాల స్థాయిలో మూడు పార్టీల నేతల మధ్య ఉన్న స్థానిక సమీకరణాలు, పోటీపై ఉన్న ఆశలు కూటమి అగ్రనాయకత్వానికి గట్టి పరీక్ష పెట్టనున్నాయి.
తాజాగా తెనాలిలో జనసేన(Janasena) మంత్రి నాదెండ్ల మనోహర్(nadendla Manohar) చేసిన వ్యాఖ్యలు ఈ పొత్తుల సవాల్‌ను మరింత స్పష్టం చేశాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర హితం కోసం జనసేన కొన్ని స్థానాల్లో వెనక్కి తగ్గిందని, అయితే అదే అసెంబ్లీ ఎన్నికల ఫార్ములాను స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్తింపజేస్తామనుకుంటే కుదరదని ఆయన తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, సమీకరణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని, ఈసారి తమ పార్టీ తరపున క్షేత్రస్థాయిలో కష్టపడిన జనసైనికులకు భారీగా అవకాశాలు ఇస్తామని జనసేన గట్టి పట్టుదలతో ఉంది.
ఇవి కూడా చదవండి
స్థానిక సంస్థల ఎన్నికలైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ వార్డులు వంటి స్థానాల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం(TDP), జనసేన, బీజేపీలకు(BJP) చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు భారీ ఆశలు పెట్టుకున్నారు. గత ఐదేళ్లుగా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పోరాడిన తమకే ఈసారి టికెట్ దక్కాలని ప్రతి పార్టీ కేడర్ పట్టుబడుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులు ఒకే స్థానం కోసం పోటీ పడుతుండటంతో, అక్కడ మైత్రిని కాపాడుకుంటూ సీట్లు కేటాయించడం నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు, ఎమ్మెల్యేలకు అత్యంత క్లిష్టంగా మారనుంది.
కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి స్థానిక పోరు కావడంతో, ఇక్కడ సాధించే ఫలితాలు రాబోయే రోజుల్లో కూటమి బలాన్ని నిర్దేశిస్తాయి. సీట్ల సర్దుబాటు సజావుగా సాగకపోతే, టికెట్లు దక్కని అసంతృప్తులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగే ప్రమాదం ఉంది. ఇది పరోక్షంగా ప్రతిపక్ష పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉండటంతో, కూటమి పెద్దలు ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, కేడర్‌ను బుజ్జగించే పనిలో పడాలని భావిస్తున్నారు. ఏది ఏమైనా, ‘స్థానిక’ సీట్ల పంచాయితీ కూటమికి ఒక పెద్ద అగ్నిపరీక్ష అనడంలో సందేహం లేదు.








