అమెరికాలో ఆధ్యాత్మిక శోభ.. సెయింట్ లూయిస్‌లో వైభవంగా శతచండీ సహిత రుద్రయాగం!
అమెరికాలోని సెయింట్ లూయిస్ హిందూ ఆలయంలో నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమైంది. అమెరికాలో ఈ తరహా యాగాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. వేద పండితుల మంత్రోచ్చారణలు, యాగశాలలోని ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి.

మొదటి రోజు పూజా కార్యక్రమాలు:
ఉదయం గోమాత పూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షా ధారణ , పంచగవ్య ప్రాశనం వంటి సంప్రదాయ కార్యక్రమాలను పండితులు వైదిక పద్ధతిలో నిర్వహించారు.
సాయంత్రం దేవతా విగ్రహాలను శోభాయాత్రగా యాగశాలకు తీసుకురాగా, భక్తులు భక్తిపూర్వకంగా స్వాగతం పలికారు.
యాగంలో అత్యంత ముఖ్య ఘట్టమైన అగ్ని మథనం ద్వారా పవిత్ర యజ్ఞాగ్నిని ఆవాహన చేసి, వాస్తు గణపతి హోమం నిర్వహించారు.
మొత్తం ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాయాగంలో ప్రతిరోజూ చండీ పారాయణం, రుద్రయాగం వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు గంగవరపు రజనీకాంత్ తెలిపారు. ప్రపంచ శాంతి, లోకక్షేమం , సర్వజన సుఖశాంతుల కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి , పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలని వారు కోరారు.








