ఎస్సీ స్థానాలే లక్ష్యంగా బీజేపీ కొత్త వ్యూహం!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని బీజేపీ సరికొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపింది. ఎస్సీ మోర్చా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గెలుపే అత్యంత కీలకమని, ఆ స్థానాలను టార్గెట్ చేస్తూనే పార్టీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో దళిత ఓటర్లు అత్యంత నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న స్థానాల ప్రకారం చూస్తే, మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 19 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (SC) రిజర్వ్ చేయబడ్డాయి. అలాగే మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 3 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయి ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇవి డబుల్ అయ్యే అవకాశం ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రిజర్వుడ్ స్థానాల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా 14 స్థానాలను గెలుచుకోగా… బీజేపీ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అందుకే, ఈసారి ఆ పొరపాట్లను సరిదిద్దుకుని, క్షేత్రస్థాయి నుంచి పక్కా ప్లాన్‌తో వెళ్లాలని కమలదళం భావిస్తోంది.
ఎస్సీ స్థానాలపై బీజేపీ కన్నేయడానికి అనేక కారణాలున్నాయి. రాష్ట్రంలో దాదాపు ప్రతీ నియోజకవర్గంలోనూ దళిత ఓటర్లు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నారు. ఈ వర్గాన్ని తమ వైపు తిప్పుకోకుండా తెలంగాణలో అధికారం సాధించడం అసాధ్యమని బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించింది. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, రిజర్వేషన్లను రద్దు చేస్తుంది.. అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టడం బీజేపీ ప్రధాన ఉద్దేశం. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారానే అక్కడ దళితులకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు లభించాయని, రిజర్వేషన్లను కాపాడిన హిస్టరీ కేవలం బీజేపీదేనని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది.
ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వల్ల పేద దళిత బస్తీల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి సరైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారనే భావనను కలిగించడం ద్వారా కాంగ్రెస్ మైలేజ్‌ను తగ్గించవచ్చనేది కమలనాథుల వ్యూహం.
రాబోయే రోజుల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో జెండా ఎగరేయడానికి బీజేపీ ఒక పక్కా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బూత్ స్థాయి నుంచి ఎస్సీ మోర్చా కార్యకర్తలను యాక్టివ్ చేయడం, ప్రతీ దళిత వాడలోనూ స్థానిక సమస్యలపై పోరాటాలు చేయడం ఇందులో భాగం. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత సంక్షేమ పథకాలు (ముద్రా లోన్లు, స్టాండప్ ఇండియా, పీఎం ఆవాస్ యోజన వంటివి) లబ్ధిదారుల ఇళ్లకు చేరేలా డోర్-టు-డోర్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. దేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వంటి దళిత, గిరిజన వర్గాలకు అత్యున్నత పదవులు కల్పించిన ఘనత బీజేపీదేనని చాటిచెప్పడం ద్వారా దళితులలో నమ్మకాన్ని పెంచాలని భావిస్తోంది.
మొత్తానికి, గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి ఎస్సీ స్థానాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ.. తెలంగాణలో తన పొలిటికల్ మైలేజ్‌ను పెంచుకోవడానికి గట్టిగానే ప్లాన్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యూహాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.








