ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ బ్యాలెట్ తేదీల ప్రకటన..!
భారతీయ యువతకు యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. అత్యంత ఆదరణ పొందిన ‘ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్’ కోసం తదుపరి బ్యాలెట్ తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ స్కీమ్ కింద ఎంపికైన వారు ఎలాంటి ఉద్యోగ స్పాన్సర్షిప్ లేకుండానే యూకేలో రెండేళ్లపాటు నివసించేందుకు, చదువుకునేందుకు, పనిచేసేందుకు వీలుంటుంది.
యూకే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ స్కీమ్ కోసం తదుపరి బ్యాలెట్ 2026 జులై 21వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. కేవలం 48 గంటల పాటు మాత్రమే ఈ విండో అందుబాటులో ఉంటుంది. అంటే, జులై 23వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు బ్యాలెట్ ముగుస్తుంది. ఈ బ్యాలెట్లో పాల్గొనడం పూర్తిగా ఉచితం.
ఏమిటీ యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్?
భారత పౌరులకు ప్రత్యేకంగా యూకే ప్రభుత్వం అందిస్తున్న వీసా మార్గమే ఈ యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్. ఇతర వర్క్ వీసాల మాదిరిగా దీనికి ముందుగా జాబ్ ఆఫర్ లేదా ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ అవసరం లేదు. ముందుగా బ్యాలెట్ పద్ధతిలో దరఖాస్తుదారులను ఎంపిక చేస్తారు. బ్యాలెట్లో పేరు వచ్చిన వారు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం అందుకుంటారు. ఈ వీసాపై రెండేళ్ల వరకు యూకేలో ఉండొచ్చు.
అర్హతలు ఏమిటి?
ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరి. దరఖాస్తుదారు కచ్చితంగా భారత పౌరులై ఉండాలి. వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యా అర్హత కలిగి ఉండాలి.యూకేలో నివసించేందుకు అవసరమైన ఖర్చుల కోసం కనీసం £2,530 (సుమారు రూ. 3.27 లక్షలు) పొదుపు ఖాతాలో ఉన్నట్లు చూపించాలి.
బ్యాలెట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత ఉన్న అభ్యర్థులు యూకే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బ్యాలెట్‌లోకి ప్రవేశించవచ్చు. దరఖాస్తు సమయంలో పూర్తి పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ వివరాలు, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటివి అందించాలి. పాస్‌పోర్ట్ స్కాన్ కాపీని కూడా జతచేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు పాస్‌పోర్ట్‌లోని సమాచారంతో సరిపోలడం తప్పనిసరి.
ఎంపికైతే తర్వాతి ప్రక్రియ ఏంటి?
బ్యాలెట్లో మీ పేరు ఎంపికైతే, మీకు ఈమెయిల్ ద్వారా వీసా దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానం అందుతుంది. ఆ తేదీ నుంచి 90 రోజుల్లోగా ఆన్లైన్ వీసా అప్లికేషన్ సమర్పించడంతో పాటు, వీసా ఫీజు, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ చెల్లించాలి. బయోమెట్రిక్ సమాచారాన్ని అందించి, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాలెట్లో ఎంపికైనంత మాత్రాన వీసా మంజూరైనట్లు కాదు. వీసా దరఖాస్తు సమయంలో అన్ని అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది.
ఖర్చులు ఎంత అవుతాయి?
బ్యాలెట్లో ఎంపికైన వారు వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
వీసా అప్లికేషన్ ఫీజు: £340 (సుమారు రూ. 43,964)
ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్: £1,552 (సుమారు రూ 2,00,687)
పొదుపు నిధులు: £2,530 (సుమారు రూ. 3,27,151) ఉన్నట్లు నిరూపించాలి.
ఈ బ్యాలెట్ పరిమిత సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఆసక్తిగల అభ్యర్థులు ముందుగానే తమ పత్రాలను సిద్ధం చేసుకోవడం మంచిది. ఒకవేళ ఈ బ్యాలెట్లో ఎంపిక కాకపోయినా అర్హతలు ఉన్నంత వరకు భవిష్యత్తులో జరిగే బ్యాలెట్లలో మళ్లీ ప్రయత్నించవచ్చు.








