ఏపీని చూసి నేర్చుకోండి… రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ విమర్శల దాడికి దిగారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు.
తెలంగాణలో భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి, ‘లాక్ అండ్ అన్‌లాక్’ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు. భూముల వివాదాలను పరిష్కరించి అన్‌లాక్ చేసేందుకు ఏకంగా 30 శాతం వసూళ్లకు పాల్పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. “మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 30 పర్సెంట్ మినిస్టర్ గా అందరికంటే అవినీతిలో ముందున్నారు” అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పోరాటం రేవంత్ రెడ్డితోనేనని, ఇది వ్యక్తిగత విభేదం కాదని, ప్రజలను ఇబ్బంది పెడుతున్నందుకేనని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) రెండు రోజుల్లోనే రిపోర్ట్ ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. “అది NDSA రిపోర్ట్ కాదు, ఎన్డీఏ (NDA) రిపోర్ట్” అని ఎద్దేవా చేశారు. SLBC టన్నెల్ కూలినప్పుడు, ఏపీలో పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నప్పుడు రాని NDSA, కాళేశ్వరం వద్దకే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రూ. 90 వేల కోట్లతో ప్రాజెక్టు కడితే, రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ఆయన నిలదీశారు. కేవలం రూ. 8.5 కోట్లతో కాపర్ డ్యాం కడితే నీళ్లను వాడుకోవచ్చని డ్యూటీలో ఉన్న ఇంజనీర్లు నివేదిక ఇచ్చినా, ప్రభుత్వం కావాలనే నీళ్లు నింపకుండా ఉద్దేశపూర్వక నేరపూరిత చర్యకు పాల్పడుతోందన్నారు. కన్నెపల్లి వద్ద రోజుకు 3 TMCల నీటిని వాడుకునే అవకాశం ఉన్నా, ప్రస్తుతం రోజుకు 28 లక్షల క్యూసెక్కుల చొప్పున దాదాపు 250 TMCల నీరు వృధాగా సముద్రం పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కరువు పరిస్థితుల్లోనూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ద్వారా నీటిని వాడుకుంటూ రైతులను కాపాడుకుంటోందని, ఏపీని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. పారిశ్రామికవేత్తల తలలకు తుపాకులు పెడితే పెట్టుబడులు ఎలా వస్తాయని, అందుకే కాగ్నిజెంట్ లాంటి పెద్ద సంస్థలు చెన్నైకి తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాము ఎయిర్పోర్ట్ మెట్రో కోసం సేకరించిన 280 ఎకరాల భూములపై రేవంత్ కన్ను పడిందని, వాటిని అమ్మేందుకే మెట్రోను రద్దు చేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని కేటీఆర్ గణాంకాలతో వివరించారు. అధికారంలోకి వచ్చినప్పుడు 35 లక్షల ఎకరాలు ఉంటే, దిగిపోయే నాటికి 1 కోటి 50 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. 4,000 కోట్ల నుండి రూ. 18,000 కోట్లకు పెంచామన్నారు. తమ కాలంలో అప్పులతో పాటు ఆస్తులు, ప్రజల ఆదాయం పెరిగాయని, కానీ రేవంత్ పాలనలో కేవలం అప్పులు మాత్రమే పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
ఇక బీజేపీపై స్పందిస్తూ.. కేంద్రంలో ఉండి ఆ పార్టీ తెలంగాణకు ఏమీ చేయలేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లాగే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఉంటుందని, అక్కడ సీఎం అభ్యర్థి ఎవరో తెలియక 8 మంది పోటీ పడుతున్నారని సెటైర్లు వేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తో తనకు వ్యక్తిగత కక్షలు లేవని, ఆయన రాజీనామా చేసి ఉంటే మంచి పేరుండేదన్నారు.
తెలంగాణలో కుల పిచ్చి లేదని, భవిష్యత్తులో రాదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, 15 మంది ఎంపీల బలం ఉంటే కేంద్రంలో రాష్ట్ర గొంతుక బలంగా వినబడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.








