పాక్ అకృత్యాల నుంచి కాపాడండి.. భారత్ కు పీఓకే నేతల వినతి.. !
పీఓకే నిరసనలు తుదిదశకు చేరాయి. పాకిస్తాన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం కావడంతో.. నిరసన కారులపై ఉక్కుపాదం మోపింది షెహబాజ్ సర్కార్. నిరసన కారులపై ఏకంగా పాక్ పోలీసులు, రేంజర్లు పబ్లిగ్గా కాల్పులు జరిపి, ఆరుగురిని బలి తీసుకున్నారు. పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. ఈపరిణామం పీఓకేలో మరింత ఉద్రిక్తతకు కారణమైంది.
కొంతకాలంగా పీవోకేలో ఇంటర్నెట్ నిలిపివేయడంతో దాదాపు 40 లక్షల మంది ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని నిరసనకారులు తెలిపారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పీవోకే ప్రజలు వాపోతున్నారు. తమ ప్రాణాలను కాపాడాలని, మానవతా సాయం అందించాలని భారత్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. పూంఛ్, దోడా సెక్టార్లలో నియంత్రణ రేఖను తెరవాలని కోరారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజలపై పాక్ అణచివేత ధోరణిని భారత్ తీవ్రంగా విమర్శించింది. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న వ్యవస్థాగత దోపిడీ, బలవంతపు ఆక్రమణలు, అణచివేత వల్లే ఈ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆహారం, మందుల సరఫరా నిలిపివేత, ఇంటర్నెట్ బ్లాక్అవుట్, తీవ్ర హింస పాక్ క్రూరత్వానికి నిదర్శనమని విమర్శించారు.
అటు, అమెరికాలో స్థిరపడిన పీవోకే పౌరులు వైట్‌హౌస్ ముందు నిరసన చేపట్టారు. పాక్ తీరును .. వైట్ హౌస్ సాక్షిగా ఎండగట్టారు. ఈ ఘటనలు పాక్ ఆక్రమణకు వ్యతిరేకంగా పీవోకేలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తున్నాయి.








