భారత్, చైనాలపై వందశాతం టాక్స్.. ఆర్థిక బంకర్ బస్టర్ లో అమెరికా మార్పులు..!
ఓవైపు ఇరాన్ ను దిగ్భందనం చేస్తూ.. నావల్ బ్లాకేడ్ అమలు పరుస్తున్న అమెరికా.. టెహ్రాన్ ను ఎలాగైనా చర్చలకు వచ్చేలా చేయాలని భావిస్తోంది. ఈ పరిణామాలపై ఇరాన్ సైతం అంతేస్థాయిలో రియాక్టవుతోంది. మరోవైపు.. ఇదే సమయంలో ఉక్రెయిన్ వార్ నిలిపివేసే విషయంపైనా అమెరికా సర్కార్ గట్టిగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా రష్యా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది కూడా.
ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు తీసుకువచ్చిన బిల్లులో అమెరికా మార్పులు చేర్పులు చేసింది. రష్యా నుంచి చమురు (Russian Oil) కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ప్రతిపాదిత సుంకాల గరిష్ఠ పరిమితిని 500 శాతం సుంకాలను 100 శాతానికి తగ్గించింది. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులు లక్ష్యంగా చేసుకొని బిల్లును తీసుకువచ్చారు. ఇప్పుడు సవరించిన ఈ బిల్లుకు అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు లభించింది.
ఇటీవల మృతి చెందిన సెనెటర్ లిండ్సే గ్రాహమ్.. ఈ ‘శాక్షనింగ్ రష్యా యాక్ట్’ను ప్రతిపాదించారు. రష్యా (Russia) చమురు దిగుమతులు చేసుకొనే దేశాలపై అధ్యక్షుడు అసాధారణస్థాయిలో సుంకాలు విధించే అధికారం ఈ బిల్లుతో లభిస్తుంది. ఆ టారిఫ్‌లు 500 శాతం వరకు ఉండాలని ప్రతిపాదించారు. అప్పట్లో దీనిని ఆర్థిక బంకర్ బస్టర్‌గా అభివర్ణించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ పరిణామాలతో ఈ బిల్లులో సుంకాల పరిమితిని సవరించి 100 శాతానికి తగ్గించడం ఒక్కటే ఊరట.
రష్యా నుంచి చమురు (Russia oil) కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌లో పుతిన్ సృష్టిస్తున్న రక్తపాతానికి భారత్, చైనా, బ్రెజిల్ పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నాయని అప్పట్లో గ్రాహమ్ ఆరోపించారు. ఇకపై ఆ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటుందన్నారు. యుద్ధం ఆపేందుకు సిద్ధమంటూ పుతిన్ మాటలు చెబుతూనే అమాయకులను చంపుతున్నారని గ్రాహమ్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు చేసిన సవరణలు కూడా మిత్రదేశాలకు అనుకూలంగా ఉండటం గమనార్హం. ఈ సుంకాలు అమల్లోకి వస్తే ముడిచమురు కొనుగోలు చేస్తోన్న ప్రధాన దేశాలు చైనా, ఇండియా, స్లొవేకియా, హంగరీ, అజర్బైజాన్ లక్ష్యంగా మారనున్నాయి.
రష్యా సహజ వాయువును దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశాలలో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగరీ, బెల్జియం ఉన్నాయి. రష్యా సహజ వాయువు ఎగుమతులలో 15% కంటే తక్కువ దిగుమతి చేసుకుంటూ, ఆ సరఫరాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటోన్న కొన్ని దేశాలకు ఈ బిల్లులో మినహాయింపులు ఇచ్చారు. ఈ నిబంధన జపాన్, ఫ్రాన్స్‌కు ప్రయోజనం చేకూర్చనుంది.
ఇదిలాఉంటే.. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో చమురు సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రష్యా ముడిచమురు (Russian oil)పై అమెరికానే మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు వాటిని తొలగించే యోచనలో ఉంది.








