చమురు వ్యాపారం ఎవడబ్బ సొమ్ము కాదు.. చేస్తే అందరూ కలిసే చేయాలన్న ఇరాన్…!
పశ్చిమాసియాలో చమురు ఎగుమతులపై ఇరాన్ హెచ్చరికలు చేసింది. చేస్తే అందరూ కలిసే చేయాలి.. లేదంటే ఎవరూ చేయకూడదని ఇరాన్ స్పష్టం చేసింది. బహ్రెయిన్ (Bahrain)లోని యూఎస్ నేవీ స్థావరంపై ఐఆర్జీసీ (IRGC strikes) దాడులు చేసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తమను కాదని ముందుకు వెళ్తే.. అమెరికా మిత్రదేశాల చమురు, గ్యాస్ ఎగుమతి మార్గాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని.. పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ ఎగుమతుల మొత్తాన్ని ఆపుతామని హెచ్చరించింది.
‘హర్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించామని చెబుతూ.. అమెరికా (USA) .. హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలను మోహరించింది. నౌకల రాకపోకలకు మార్గాలను మూసివేసి.. చమురు, గ్యాస్‌లను ప్రపంచానికి అందకుండా చేసింది. దీనివల్ల ఆ దేశ ఆర్థిక ప్రత్యర్థుల ప్రయోజనాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. వారి దుర్మార్గాలకు తగిన బుద్ధి చెప్పడానికి మా దళాలు బహ్రెయిన్‌లోని 5వ ఫ్లీట్ బేస్‌పై విజయవంతంగా దాడి చేశాయి. ఈ దాడుల్లో ఎన్ఎస్ఐ మేనేజ్మెంట్ సెంటర్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు ధ్వంసమయ్యాయి. పశ్చిమాసియాలో వ్యాపారం చేస్తే అందరూ కలిసే చేయాలి. లేదంటే ఎవరూ చేయకూడదు’ అని ఐఆర్జీసీ హెచ్చరించింది.
ఇరాన్‌కు చైనాకంపెనీల సహకారం.. అమెరికా ఆరోపణలు:
ఇతర దేశాలపై దాడులు చేయడానికి ఇరాన్‌కు పలు చైనా (China) కంపెనీలు సహకరిస్తున్నాయని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ట్ ఆరోపించారు. ఈ విషయంలో చైనా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్నారు. హూతీలపై ఆయుధాల నిషేధాన్ని విధించిన ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని కూడా పలు చైనా కంపెనీలు, ఇతర సంస్థలు ఉల్లంఘించాయని పేర్కొన్నారు.
లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్..
ఓ వైపు అమెరికా-ఇరాన్‌లు పరస్పర దాడులు చేసుకుంటుంటే.. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ (Israel) దాడులు కొనసాగిస్తోంది. దీంతో లెబనాన్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.








