హర్మూజ్ కు పుజైరా ప్రత్యామ్నాయమా..?
నిత్యం ప్రమాదకరంగా మారిన హర్మూజ్ ప్రపంచవాణిజ్యాని ప్రాణసంకటంలా మారింది. అత్యంత ఇరుకుగా ఉండే ఈ ప్రాంతం నుంచి ఐదోవంతు వాణిజ్య నౌకల ప్రయాణం సాగుతోంది. దీంతో ఈ జలసంధిని వదలలేక, ప్రమాదాల బారిన పడి ఇబ్బందులు పడలేక ప్రపంచం తలపట్టుకుంటోంది. మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాల పరిస్థితి అయితే ముందు నుయ్యి, వెనక గొయ్యిలా తయారైంది. ఈపరిస్థితుల్లో యూఏఈ భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెట్టింది. హర్మూజ్ లేకున్నా..తన వాణిజ్యానికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రచిస్తోంది.
పుజైరాలో మల్టీపర్పస్ పోర్ట్ నిర్మాణం..
హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అభివృద్ధి చేయడంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, దుబాయ్‌కి చెందిన ప్రముఖ పోర్ట్స్ ఆపరేటర్ ‘డీపీ వరల్డ్’, దేశ తూర్పు తీరంలోని ఫుజైరాలో కొత్త మల్టీపర్పస్ పోర్టు, కంటైనర్ టెర్మినల్ నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే, నౌకలు ప్రమాదకరమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే నేరుగా యూఏఈకి సరుకు రవాణా చేసే వెసులుబాటు కలుగుతుంది.
ఫుజైరాలోని ఈ నూతన పోర్టు నేరుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇక్కడికి చేరిన సరుకును సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాలకు రోడ్డు మార్గం ద్వారా సులభంగా తరలించవచ్చు. ఈ భారీ ప్రాజెక్టు కోసం వందల మిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమని, సుమారు 18 నెలల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంపొందించుకునే ఈ ప్రణాళికలో భాగంగా, షార్జాకు చెందిన ‘గల్ఫ్టైనర్’ సంస్థ సైతం సమీపంలోని ఖోర్ ఫక్కన్ పోర్టు విస్తరణ కోసం సుమారు 2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెడుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి నుంచి తమ ఆర్థిక వ్యవస్థను, సరఫరా వ్యవస్థను సురక్షితంగా కాపాడుకోవాలనే యూఏఈ దీర్ఘకాలిక లక్ష్యానికి ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి.








