కడప జిల్లాలోని దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్
కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ఆరా
ప్రొద్దుటూరు: కడప జిల్లాలో పర్యటించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం మధ్యాహ్నం ప్రొద్టుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పాఠశాల పనితీరుపై ఆరా తీశారు. ముందుగా పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులతో మంత్రి సంభాషించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల అందజేత, వాటి నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇరాన్-అమెరికా యుద్ధాన్ని ఎంతమంది గమనిస్తున్నారని అడిగారు. విద్యతో పాటు శారీరక వ్యాయామం ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు.
నా భవిష్యత్ మీపై ఆధారపడి ఉంది
మీకు మార్కులు రాకపోతే నా మార్కులు పోతాయని విద్యార్థులను ఉద్దేశించి ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. నా భవిష్యత్ మీపై ఆధారపడి ఉంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రజాప్రభుత్వం విశేషంగా కృషిచేస్తోంది. అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, యూనిఫాం, షూ, తల్లికి వందనం పథకాలను అమలుచేస్తోందని వివరించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశారు. ఐవీఆర్ఎస్ ద్వారా తల్లిదండ్రులు ఫీడ్ బ్యాక్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం బాగుందని ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రి నారా లోకేష్ కు వివరించారు.
లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి పెట్టాలి
పాఠశాల తనిఖీ సందర్భంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలపై మంత్రి ఆరా తీశారు. లెర్నింగ్ అవుట్ కమ్స్ లో పాఠశాల 1.3 స్టార్ రేటింగ్ పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ ఏ.ధనలక్ష్మిని మంత్రి ప్రశ్నించారు. ఫార్మాటివ్, సమ్మెటివ్ అసెస్ మెంట్ పై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. పనితీరులో వెనుకబడిన పాఠశాలల పట్ల ఎంఈవోలు దృష్టిపెట్టాలని, 15 రోజులకోసారి సమీక్ష చేయాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు తక్కువగా ఉండటంపైనా మంత్రి ఆరా తీశారు. హాజరుపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా ఉపాధ్యాయులు గైర్హాజరయ్యే పరిస్థితిని నివారించాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ గతేడాది కంటే తక్కువగా ఉండటంపై మంత్రి ఆరా తీశారు. 10 మంది విద్యార్థులు వసతిగృహాలకు, కేజీబీవీలకు తరలివెళ్లడం వల్ల ఎన్ రోల్ మెంట్ తగ్గిందని ప్రిన్సిపాల్ వివరించారు. గతేడాది కంటే అడకమిక్ ఫెర్ఫార్మెన్స్ మెరుగుపడటం పట్ల మంత్రి ప్రశంసించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకు ఉపాధ్యాయుల సహకారం కావాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యమని, అందరం కలిసికట్టుగా ఉంటేనే ఇది సాధ్యమని చెప్పారు. విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పై దృష్టిపెట్టాలని.. ముఖ్యంగా విద్యార్థినులు డ్రాప్ అవుట్స్ కాకుండా చూడాలన్నారు. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. లెర్నింగ్ అవుట్ కమ్స్ లో వచ్చే ఏడాదికి 4 స్టార్ రేటింగ్ సాధిస్తామని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు. అనంతరం అందరితో కలిసి మంత్రి ఫోటోలు దిగారు.








