దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25శాతం ఏపీకే : మంత్రి లోకేష్
భవిష్యత్‌పై విశ్వాసానికి దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ నిదర్శనం
ఏపీ పారిశ్రామిక ప్రగతిలో దాల్మియా భారత్‌ది విలువైన భాగస్వామ్యం
పరిశ్రమలకు కావాల్సిన విధంగా యువతను సిద్ధం చేస్తున్నాం
నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి సహకారం అందించండి
దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్
జమ్మలమడుగు: ఏపీపై విశ్వాసానికి దాల్మియా భారత్ సిమెంట్ ప్లాంట్ విస్తరణ నిదర్శనం. ఏపీ పారిశ్రామిక ప్రగతిలో దాల్మియా భారత్ ది విలువైన భాగస్వామ్యం అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ… దాల్మియా సిమెంట్స్ కడప ప్లాంట్ లైన్–2 విస్తరణకు సంబంధించిన భూమిపూజ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు కేవలం ఒక తయారీ యూనిట్ విస్తరణ గురించి మాత్రమే కాదు.. విశ్వాసాన్ని మరింత విస్తరించే రోజు. వ్యాపారంలో మొదటి పెట్టుబడి అవకాశాలపై నమ్మకంతో వస్తుంది. రెండో పెట్టుబడి అనుభవంపై నమ్మకంతో వస్తుంది. ఇప్పటికే ఉన్న ఒక సంస్థ తన కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించినప్పుడు అది గట్టి సందేశాన్ని ఇస్తుంది. రాష్ట్రంపై విశ్వాసం, పాలనపై విశ్వాసం, భవిష్యత్తుపై విశ్వాసం. ఈ రోజు దాల్మియా భారత్ చేపడుతున్న విస్తరణ కూడా అలాంటి విశ్వాసానికే నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మా రాష్ట్రంపై తమ నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిన దాల్మియా భారత్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
పునీత్ దాల్మియా జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం
పునీత్ జీ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన ఐఐటీ ఢిల్లీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఐఐఎం బెంగళూరు నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. నేడు దేశంలోని అత్యంత గౌరవనీయ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా నిలిచారు. అయితే నన్ను మరింతగా ప్రేరేపించేది ఏమిటంటే.. భారతదేశంలోని తొలి డిజిటల్ స్టార్టప్‌లలో ఒకటైన JobsAhead.com సహస్థాపకులుగా వ్యవహరించడం. మీరు కేవలం ఒక వారసత్వాన్ని స్వీకరించలేదు. దానికి నాయకత్వం వహించే ముందు… మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకున్నారు. అదే ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తి ఈ రోజుకీ దాల్మియా భారత్‌ను ముందుకు నడిపిస్తోంది.
మానవ వనరులే దేశానికి విలువైన సంపద
ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా… మీ నాయకత్వంలోని ఒక అంశంతో ప్రత్యేక అనుబంధం ఉంది. మీరు భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకదానికి నాయకత్వం వహిస్తున్నప్పటికీ… విద్యాభివృద్ధికి, విద్యా సంస్థల నిర్మాణానికి నిరంతరం అండగా నిలుస్తున్నారు. అశోక విశ్వవిద్యాలయంతో మీ అనుబంధం… భారతదేశానికి అత్యంత విలువైన సంపద సిమెంట్, ఉక్కు కాదు, మానవ వనరులేనని మీరు విశ్వసిస్తున్నారనే విషయాన్ని ప్రతిబింబిస్తోంది. అదే తత్వాన్ని మేం కూడా బలంగా విశ్వసిస్తున్నాం. ప్రభుత్వాలు ప్రతిభను తీర్చిదిద్దుతాయి. పరిశ్రమలు అవకాశాలను సృష్టిస్తాయి. రెండూ కలిసి భవిష్యత్తును నిర్మిస్తాయి.
ఏపీ పారిశ్రామిక ప్రగతిలో దాల్మియా భారత్ ది విలువైన భాగస్వామ్యం
దాల్మియా భారత్ అనేక ఏళ్లుగా ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో భాగస్వామిగా ఉంది. ఈ రోజు జరుగుతున్న విస్తరణ మన భాగస్వామ్యానికి ఆరంభం కాదు.. ఇది పరస్పర విశ్వాసంతో కొనసాగుతున్న బంధానికి తదుపరి అధ్యాయం. రూ.3,100 కోట్ల ఈ విస్తరణ… ఏపీ పట్ల దాల్మియా భారత్‌కు ఉన్న దీర్ఘకాలిక నిబద్ధతకు నిదర్శనం. అలాగే ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. సస్టైనబులిటీ, గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, రెస్పాన్సిబుల్ గ్రోత్.. ఇవన్నీ మేం ఎంతో విలువైనవిగా భావించే సూత్రాలు.
స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఏపీ బలం
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు నిర్ణయాల్లో వేగం, విధానాల్లో స్థిరత్వం, పాలనలో సేవాభావాన్ని కోరుకుంటున్నారు. గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంలో ఏపీ ఈ మూడు సూత్రాల ఆధారంగా పెట్టుబడులకు అనుకూలమైన పటిష్టమైన వ్యవస్థను నిర్మిస్తోంది. అందుకే ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను విస్తరిస్తున్నారు. కొత్త పెట్టుబడిదారులు కూడా ఏపీని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు.
సుస్థిరతే అభివృద్ధికి అతిపెద్ద ప్రేరణ
ప్రపంచ దేశాలు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వైపు అడుగులు వేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి అవసరమైన మౌలిక వసతులను నిర్మిస్తున్న కొద్దీ… ఉక్కు, సిమెంట్, ఇంధనం, రవాణా వంటి రంగాలపై ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మరింత పెరుగుతుంది.
అత్యల్ప కర్బన ఉద్గారాలున్న సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా ఒకటి
కర్బన్ ఉద్గారాలను తగ్గించడం అత్యంత క్లిష్టమైన పరిశ్రమల్లో సిమెంట్ రంగం అత్యంత సవాలుతో కూడుకున్నది. ప్రపంచంలో అత్యల్ప కర్బన ఉద్గారాలున్న సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా ఒకటి. 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ సంస్థగా మారాలని సంకల్పించింది. పునరుత్పాదక ఇంధనం, ఇంధన సామర్థ్యం, విద్యుత్ ఆధారిత రవాణాలో తన నాయకత్వాన్ని చాటుతూ.. ప్రపంచంలోనే RE100, EP100, EV100 కార్యక్రమాల్లో సభ్యత్వం పొందిన తొలి సిమెంట్ సంస్థగా కూడా దాల్మియా భారత్ నిలిచింది. కడప ప్లాంట్ విస్తరణ కూడా ఈ విషయాన్ని ప్రతిబింబిస్తోంది. కార్యకలాపాల్లో 80 శాతం వరకు రెన్యూవబుల్ ఎనర్జీ, వేస్ట్ హీట్ రికవరీ, మున్సిపల్ వ్యర్థాల కో ప్రాసెసింగ్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్, విస్తృత స్థాయిలో వర్షపు నీటి సంరక్షణ, విద్యుత్ వాహనాల ఆధారిత లాజిస్టిక్స్, ఏఐ ఆధారిత కార్యాచరణ సామర్థ్యం, అత్యుత్తమ ఉద్గార నియంత్రణ వ్యవస్థలు వంటి అంశాలతో ఈ ప్లాంట్ భవిష్యత్తుకు సిద్ధమైన తయారీకి ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి పరిశ్రమలతో భాగస్వామ్యం వహించడం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో గర్వకారణం.
కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు కడప జిల్లా ప్రజలు
జమ్మలమడుగు ఎప్పుడొచ్చినా జోష్ అదిరిపోతుంది. కడప జిల్లా ప్రజలు అనగానే నాకు గుర్తొచ్చేది కష్టం. కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు కడప జిల్లా ప్రజలు. ఎవరి నుంచి సహాయం ఆశించరు. ఇక్కడి కార్మికులు, రైతులు ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ అంబాసిడర్లు. ఇక్కడ రైతులు పిల్లల భవిష్యత్ కోసం భూములు త్యాగం చేశారు. మీ పిల్లలు కంపెనీలో కష్టపడి పనిచేసి మంచి పేరు తీసుకొచ్చారు. మేం అనుమతులు ఇవ్వగలం కానీ కంపెనీకి నమ్మకం మీ వలనే వస్తుంది. మీరు ఆ నమ్మకాన్ని ఇచ్చారు.
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25శాతం ఏపీకి వచ్చాయి
మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, నేను అన్ని దేశాలు తిరుగుతూ ఏపీని ప్రమోట్ చేస్తున్నాం. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అడుగుతున్నాం. నేను యువగళం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం కోసం కష్టపడుతున్నాం. రెండేళ్లలోనే అనేక పెద్ద కంపెనీలు ఏపీకి తీసుకువచ్చాం. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25శాతం ఏపీకి వచ్చాయి. కొత్త కంపెనీలు తీసుకురావడం ఎంత ముఖ్యమో.. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా మనకి అంతే ముఖ్యం. నేను కొత్త వాళ్లను కన్విన్స్ చేయడంతో పాటు మనదగ్గర ఉన్న కంపెనీలతో ఎక్స్ పాన్షన్ చేయించాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం.
రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వాళ్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం
మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వాళ్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. అందుకే వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని రిక్వెస్ట్ లు వస్తున్నా.. వాళ్లు మాత్రం ఏపీనే ఎంచుకుంటున్నారు. ఈ రోజు దాల్మియా సిమెంట్స్ విస్తరణ జరగడానికి ప్రధాన కారణం ఇక్కడి రైతులు, కంపెనీని నడిపిస్తున్న ఉద్యోగులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు. మీ అందరికీ అభినందనలు. కడప జిల్లా భవిష్యత్ కు మరో బలమైన పునాది వేశాం. నేను ప్రపంచం మొత్తం తిరిగి కంపెనీలు తీసుకొస్తాను. అది నా బాధ్యత. కానీ ఆ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చిన యువతపై కూడా బాధ్యత ఉంటుంది. మీ క్రమశిక్షణ, శ్రమించే తత్వం, మీ వ్యక్తిత్వం వల్ల మనకి మంచి పేరు వస్తుంది. మీరంతా కష్టపడి పనిచేస్తే మరిన్ని కంపెనీలు ఏపీకి వస్తాయి.
పరిశ్రమలకు కావాల్సిన విధంగా యువతను సిద్ధం చేస్తున్నాం
నాకొక వింత పరిస్థితి ఉంది. మేం కంపెనీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం.. మీ దగ్గర నిపుణులైన యువత ఉన్నారా అని కొంతమంది అడుగుతున్నారు. అందుకే ఇప్పుడు ఐటీఐలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నాం. ఒక్కో ఐటీఐని ఒక్కో కంపెనీకి అనుసంధానిస్తున్నాం. పరిశ్రమలకు కావాల్సిన విధంగా యువతను సిద్ధం చేస్తున్నాం. మొన్న శ్రీసిటీలో యూనివర్సిటీని ప్రారంభించా. అది ఇండియాలోనే ఫస్ట్ ఎల్‌ఈజీ(లెర్న్, ఎర్న్, గ్రాడ్యుయేట్) మోడల్ యూనివర్సిటీ. మూడు నెలలు క్లాస్ రూమ్ లో, 8 నెలలు ఇండస్ట్రీలో వర్క్. చదువుకుంటూనే సంపాదిస్తారు. చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగానికి కావాల్సిన అన్ని నైపుణ్యాలు వారికి ఉంటాయి.
నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి సహకారం అందించండి
ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను నిర్మించే మా ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వానికి భాగస్వామిగా నిలవాలని పునీత్ జీని కోరుతున్నా. మా యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడంలో మాకు సహకరించండి. నైపుణ్యాభివృద్ధిలో ఏపీని దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మాతో కలిసి పనిచేయండి. అశోక విశ్వవిద్యాలయం తరహాలో ఉన్నత విద్యను ప్రోత్సహించే మరో ప్రపంచస్థాయి విద్యాసంస్థను ఏపీలో ఏర్పాటు చేయడాన్ని కూడా మీరు పరిశీలిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది.
ఏపీని రెండో ఇల్లుగా భావించండి
ఒక వ్యాపారవేత్తగా మీ ఔత్సాహిక పారిశ్రామిక ప్రయాణం పట్ల, అలాగే మీరు భవిష్యత్తులో ప్రారంభించబోయే కొత్త వ్యాపారాల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను మీ రెండో ఇల్లుగా భావించండి. మీరు ఏ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నా ముందుగా మాకోసారి ఫోన్ చేయండి. మీకు అత్యుత్తమ వేదికను, అత్యంత ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను, అనుకూలమైన విధానాలను అందిస్తాం. మీతో మేం పోటీ పడేది ఒక్క విషయంలోనే… వేగంలో. నా దృష్టిలో ఇది కేవలం ఒక సిమెంట్ ప్లాంట్ విస్తరణ మాత్రమే కాదు… దాల్మియా గ్రూప్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే ఘట్టం.
అభివృద్ధిలో దాల్మియా భాగం
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్–2047 దార్శనికత, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర–2047 దార్శనిక మార్గదర్శకత్వంలో, దాల్మియా భారత్ ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో విలువైన భాగస్వామిగా నిరంతరం కొనసాగుతుందని పూర్తి విశ్వాసం ఉందని లోకేష్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దాల్మియా భారత్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ దాల్మియా, దాల్మియా భారత్ లిమిటెడ్ గ్రోత్ అండ్ ఎక్స్ పాన్షన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేసీ బిర్లా, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ హెడ్ గణేష్ వామనరావు జిర్కుంత్వార్, ప్లాంట్ హెడ్ అర్పన్ పరేఖ్, ప్రాజెక్ట్ హెడ్ అనుపమ్ అగర్వాల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ. భరత్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీ.ఆదినారాయణ రెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ సీహెచ్ భూపేష్ రెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.








