రేవంత్ రెడ్డికి.. పవన్ కల్యాణ్ కీలక లేఖ..!
బాలికలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఇలాంటి సంఘటనల నేపథ్యంలో చిన్నారుల రక్షణే ధ్యేయంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి(Revanth Reddy) ఆయన ఒక లేఖ రాశారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాల పట్ల చట్టాలు మరింత కఠినంగా అమలు కావాలని, ‘పోక్సో’ (POCSO) చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుకుంటూ నిందితులకు ఎలాంటి బెయిల్ రాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల తెలంగాణలోని షాద్నగర్ పరిధిలో పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ బెయిల్పై బయటకు వచ్చి, పగతో బాధిత బాలిక కుటుంబంలోని ఆరుగురిని దారుణంగా హతమార్చిన ఘోర ఉదంతాన్ని పవన్ కల్యాణ్ ఈ లేఖలో ప్రస్తావించారు. నిందితులకు కోర్టుల ద్వారా అంత సులభంగా బెయిల్ లభించడం వల్లే ఇలాంటి ఘోరాలు పునరావృతం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల బెయిల్ దరఖాస్తులను ప్రభుత్వ న్యాయవాదులు ప్రాథమిక దశలోనే కోర్టుల్లో తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు.
చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ పవన్ కల్యాణ్ లేఖలో పలు కీలక సూచనలు చేశారు. పోక్సో చట్టం కింద వచ్చే ఏ ఒక్క చిన్న ఫిర్యాదునైనా పోలీసులు నిర్లక్ష్యం చేయకూడదని, ప్రాథమిక విచారణ పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే కేసు (FIR) నమోదు చేయాలన్నారు. అలాగే ఈ కేసుల దర్యాప్తుకు ఒక నిర్దిష్ట కాలపరిమితిని విధించుకుని, అత్యంత వేగంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు), ఆర్టికల్ 39 (చిన్నారులకు రక్షణ) ప్రకారం దేశంలోని ప్రతి చిన్నారి హక్కులను, ప్రాణాలను కాపాడాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. కేసు పెట్టిన తర్వాత నిందితుల నుండి బాధిత కుటుంబాలకు, సాక్షులకు ప్రాణహాని ఉండే అవకాశం ఉన్నందున వారికి ప్రభుత్వం తరఫున పటిష్ట రక్షణ కల్పించాలన్నారు. షాద్నగర్ లాంటి అమానవీయ సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే పోక్సో చట్టాలను మరింత కఠినతరం చేస్తూ ఉక్కుపాదం మోపాలని తెలంగాణ సీఎంను కోరారు.








