బూమ్రా ఖాతాలో మరో క్రేజీ రికార్డ్..!
టీమిండియా ప్రీమియం ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రావన్డే క్రికెట్లోకి అదిరిపోయే రీతిలో పునరాగమనం చేశాడు. ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లో ఆయన అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌ను అవుట్ చేయడం ద్వారా, ఇంగ్లాండ్ దేశంలో వన్డే ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారతీయ బౌలర్‌గా బుమ్రా అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఇంతకుముందు ఈ రికార్డు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేరిట ఉండేది. జడేజా ఇంగ్లాండ్ వేదికగా 30 వికెట్లు తీయగా, తాజా మ్యాచ్‌తో బుమ్రా 31వ వికెట్‌ను సాధించి అతనిని అధిగమించాడు. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), మదన్ లాల్ (27 వికెట్లు), మహమ్మద్ షమీ (26 వికెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ మైలురాయితో పాటు బుమ్రా వన్డే క్రికెట్లో తన 150వ వికెట్ మార్కును కూడా విజయవంతంగా దాటాడు.
ఈ ఘనత సాధించే క్రమంలో బుమ్రా భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా (వేసిన బంతుల పరంగా) 150 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఆయన కేవలం 4,605 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈ జాబితాలో మహమ్మద్ షమీ (4,070 బంతులు), కుల్దీప్ యాదవ్ (4,513 బంతులు) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు గట్టి షాక్ ఇచ్చాడు. 12వ ఓవర్ వరకు వికెట్ కోల్పోని ఇంగ్లాండ్‌ను గుర్నూర్ బ్రార్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. ఆ వెంటనే బుమ్రా తన స్పెల్‌లో హ్యారీ బ్రూక్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ కోలుకోలేని ఒత్తిడిలోకి జారుకుంది.








