అమెరికాలో మరో విషాదం, ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్ధి..!
ఉన్నత చదువులు చదివి, అమెరికాలో మంచి భవిష్యత్తును వెతుక్కుందామని వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. అమెరికాలోని(US) న్యూజెర్సీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా వినుకొండ మండలం, ఉమ్మడివరం గ్రామానికి చెందిన ‘మక్కెన ప్రసన్న‘(Atluri Prasanna) అనే యువతి అక్కడికక్కడే మరణించింది. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా మరియు ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందడంతో ఉమ్మడివరంలోని ప్రసన్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు, విదేశాల్లో స్థిరపడుతుందని ఆశించిన కుటుంబానికి ఈ వార్త కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆవేదనతో కోరుతున్నారు. ఇటీవలి కాలంలో అమెరికాలో వరుసగా జరుగుతున్న తెలుగు వారి మరణాలు ప్రవాసాంధ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం కొద్దిరోజుల క్రితమే, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన ప్రసన్న అట్లూరి అనే 25 ఏళ్ల విద్యార్థిని న్యూయార్క్లో జరిగిన కారు ప్రమాదంలో మరణించింది.
పేస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆమె, తన స్నేహితులతో కలిసి గుడికి వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం మరువక ముందే జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లాకు చెందిన రాజశెట్టి స్పందన అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికాగోలోని ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో అత్యవసర చికిత్స పొందుతోంది. ఒకవైపు ప్రసన్న అట్లూరి మరణం, మరోవైపు స్పందన ప్రాణాలతో పోరాడుతున్న తరుణంలోనే, ఇప్పుడు పల్నాడు జిల్లాకు చెందిన మక్కెన ప్రసన్న కూడా న్యూజెర్సీ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.








