జెన్ జీ… AI సినిమాలను తిరస్కరిస్తోందా? నోలన్ విశ్లేషణ!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
థియేటర్లో…
లైట్లు ఆరిపోయాయి.
స్క్రీన్ మొత్తం చీకటి.
ఒక్కసారిగా… ఒక లేటెస్ట్ క్రేజీ చిత్రం ట్రైలర్ మొదలైంది. భారీ విజువల్స్… అద్భుతమైన కెమెరా షాట్లు… గుండె వేగం పెంచే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్… రెండు నిమిషాల తర్వాత ట్రైలర్ ముగిసింది.
లైట్లు వెలిగాయి.
ప్రేక్షకులు బయటకు వస్తున్నారు. ఎవ్వరూ హీరో గురించి మాట్లాడటం లేదు. ఎవ్వరూ దర్శకుడి గురించి మాట్లాడటం లేదు.మరి దేని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ల నుంచి వస్తున్న ఒకే ఒక్క మాట.
“బ్రో… చాలా భాగం AIతో చేశారుగా!”
కొన్ని సంవత్సరాల క్రితం…
ఇదే మాట ఒక ప్రశంస.
ఈ రోజు…
అదే మాట ఒక విమర్శ.
ఈ చిన్న మార్పే ప్రపంచ సినిమా పరిశ్రమ ముందు ఒక పెద్ద ప్రశ్నను నిలబెట్టింది. టెక్నాలజీ వెనకబడిందా లేక టెక్నాలిజీ కంటే వేగంగా ప్రేక్షకుడు మారిపోతున్నాడా? అదే ప్రశ్నను ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ కూడా లేవనెత్తుతున్నారు.
ఇవి కూడా చదవండి
నోలన్‌ను ఆశ్చర్యపరిచింది AI కాదు… ప్రేక్షకుడి తీర్పు
సాధారణంగా AI గురించి జరిగే చర్చలన్నీ ఒకే దిశలో సాగుతాయి. ఉద్యోగాలు పోతాయా? దర్శకులను భర్తీ చేస్తుందా? సినిమాలు పూర్తిగా AIతో తయారవుతాయా? ఇలాంటి ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ నోలన్ దృష్టిని ఆకర్షించింది మరో విషయం.
AI ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నది కాదు… AIతో తయారైన కంటెంట్‌ను ప్రేక్షకులు ఎంత వేగంగా గుర్తిస్తున్నారన్నది.
రీసెంట్ గా Gen Z గురించి మాట్లాడిన ఆయన, “టెక్నాలజీలో వస్తున్న పెద్ద పెద్ద మార్పులను ఒక తరం ఇంత వేగంగా గుర్తించి… తిరస్కరించడం నేను ఎప్పుడూ చూడలేదు” అని వ్యాఖ్యానించారు.
తన పిల్లలనే ఉదాహరణగా చెబుతూ, AIతో తయారైన కంటెంట్‌లోని కృత్రిమత్వాన్ని వాళ్లు చాలా త్వరగా గుర్తిస్తున్నారని ఆయన అన్నారు. వాళ్లు ఆన్లైన్ ప్రపంచంలోనే పెరిగిన తరం కాబట్టి, నకిలీగా అనిపించే అంశాలను వెంటనే పసిగట్టగలుగుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
“AI Slop”… ఇప్పుడు ప్రపంచం మాట్లాడుతున్న కొత్త పదం
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో “AI Slop” ఒకటి. ఇది అధికారిక సాంకేతిక పదం కాదు. క్రియేటివిటీ లేకుండా, ఒకే తరహా టెంప్లేట్లతో, వేగంగా తయారయ్యే AI ఫోటోలు, వీడియోలు, పోస్టర్లు, యూట్యూబ్ కంటెంట్‌ను విమర్శిస్తూ ఈ పదాన్ని వాడుతున్నారు.
అంటే సమస్య AIలో లేదని, ఆలోచన లేకుండా AIని షార్ట్‌కట్‌గా ఉపయోగించడంలోనే ఉందనేది నిజం.
నోలన్ అసలు చెప్పింది AIకు వ్యతిరేకమా?
అసలు కాదు. నోలన్ AIని పూర్తిగా తిరస్కరించలేదు. కొన్ని రంగాల్లో అది ఎంతో ఉపయోగకరమని ఆయన అంగీకరించారు. అయితే సినిమా రంగానికి వచ్చేసరికి, “ఇది చాలా తప్పుడు సమయంలో వచ్చింది” అని ఆయన వ్యాఖ్యానించారు.
గత కొన్నేళ్లుగా సినిమా పరిశ్రమ భారీగా వర్చువల్ ప్రొడక్షన్, డిజిటల్ ఎఫెక్ట్స్ వైపు వెళ్లింది. అదే సమయంలో ప్రేక్షకుల్లో మాత్రం మళ్లీ నిజమైన లొకేషన్లు, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, సహజమైన అనుభూతి ఉన్న సినిమాలపై ఆసక్తి పెరుగుతోందనే అభిప్రాయం పరిశ్రమలో వినిపిస్తోంది.
ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఇచ్చి సక్సెస్ అయ్యిన యువ దర్శకులు కర్రీ బార్కర్, కేన్ పార్సన్స్లను నోలన్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రేక్షకులు మళ్లీ మానవ స్పర్శ ఉన్న ప్రపంచాన్ని కోరుకుంటున్నారని ఆయన భావిస్తున్నారు.
నోలన్ మాటలకు ఎందుకు పట్టించుకోవాలి?
ఈ వ్యాఖ్యలు ఎవరైనా దర్శకుడు చేసి ఉంటే బహుశా ఇంత చర్చ జరిగేది కాదు. కానీ ఇవి చెప్పింది క్రిస్టోఫర్ నోలన్. అత్యాధునిక IMAX టెక్నాలజీని ఉపయోగిస్తూనే, సాధ్యమైనంత వరకు నిజమైన సెట్స్, నిజమైన స్టంట్స్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌పైనే ఆధారపడే దర్శకుడు. టెక్నాలజీని ప్రేమించే వ్యక్తే… టెక్నాలజీ పరిమితుల గురించి మాట్లాడటం ఈ చర్చను మరింత ఆసక్తికరంగా మార్చింది.
మన తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఇదే మార్పా?
ఈ ధోరణి కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాలేదు. మన దగ్గర కూడా సినిమా పోస్టర్ విడుదలైన వెంటనే “ఇది AI పోస్టర్లా ఉంది” అనే కామెంట్లు కనిపిస్తున్నాయి. యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌లో AI ఇమేజ్ కనిపిస్తే వెంటనే గుర్తిస్తున్నారు. కథ, భావోద్వేగం లేకుండా కేవలం విజువల్ కోసం AIని వాడితే ప్రేక్షకులు సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నారు.
అయితే AIతో చేసిన ప్రతి కంటెంట్ నాసిరకమే అని చెప్పలేం. అద్భుతమైన AI విజువల్స్ కూడా వస్తున్నాయి. కానీ ప్రేక్షకులు ఇప్పుడు ఒక కొత్త ప్రమాణాన్ని పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. “ఇది AIతో చేశారా?” అన్న ప్రశ్న కంటే, “ఇది నన్ను నిజంగా కదిలించిందా?” అన్న ప్రశ్నకు ఎక్కువ విలువ ఇస్తున్నారు.
అసలు చర్చ AI గురించికాదు… నమ్మకం గురించి
AIను వాడాలా వద్దా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న కాదు. ఎలా వాడాలి? అనేదే అసలు చర్చ. రిసెర్చ్‌లో, ప్రీ-విజువలైజేషన్లో, ఎడిటింగ్‌లో, విజువల్ ఎఫెక్ట్స్‌లో AI గొప్ప సహాయక సాధనంగా మారొచ్చు. కానీ ప్రేక్షకుడికి అది కేవలం షార్ట్కట్లా అనిపిస్తే… టెక్నాలజీ ఎంత శక్తివంతమైనదైనా, భావోద్వేగ అనుభూతిని ఒంటరిగా సృష్టించలేకపోవచ్చు.
చివరికి… ప్రేక్షకుడు చూసేది టెక్నాలజీ కాదు
రేపు మీ అభిమాన హీరో సినిమా మొత్తం AI సహాయంతో తయారైందని ముందే ప్రకటిస్తే… మీరు థియేటర్‌కు వెళ్తారా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కో ప్రేక్షకుడికి ఒక్కోలా ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
థియేటర్లో లైట్లు ఆరిపోతాయి. స్క్రీన్ మీద కథ మొదలవుతుంది. ప్రేక్షకుడు మళ్లీ అదే ప్రశ్న అడుగుతాడు.
“ఇది నిజంగా నన్ను కదిలించిందా?”
ఆ ప్రశ్నకు సమాధానం “అవును” అయితే…
ఆ సినిమా AIతో తీశారా, మనుషులతో తీశారా అన్నది రెండో విషయం.
అదే మనని కదిలించలేకపోతే…
ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్నా… థియేటర్ బయటికి వచ్చే ప్రేక్షకుడి నోటి నుంచి మళ్లీ అదే మాట వినిపించే ప్రమాదం ఉంది.
“బ్రో… ఇది AIతో చేశారుగా!”
బహుశా… అదే మారుతున్న ప్రేక్షకుడి గురించి క్రిస్టోఫర్ నోలన్ మనకు గుర్తు చేస్తున్న అసలు విషయం.
ఇవి కూడా చదవండి








