‘సర్’ దెబ్బకు వణుకుతున్న ఓవైసీ ఫ్యామిలీ..!?
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణలో సాగుతున్న ఓటర్ల స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రస్తుతం హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర రాజకీయ కాక రేపుతోంది. మునుపెన్నడూ లేని విధంగా సాగుతున్న ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన, దశాబ్దాలుగా పాతబస్తీని తమ రాజకీయ సామ్రాజ్యంగా ఏలుతున్న మజ్లిస్ పార్టీకి, ముఖ్యంగా ఓవైసీ కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. క్షేత్రస్థాయిలో నకిలీ ఓట్లు, అక్రమ ఓట్ల వ్యవహారం ఈ ప్రత్యేక తనిఖీలతో వెలుగులోకి రాబోతుండటమే ఇందుకు ప్రధాన కారణమనే చర్చ జోరందుకుంది.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా వంటి పాతబస్తీ నియోజకవర్గాల్లో ప్రతి ఎన్నికల్లోనూ అత్యంత తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుంటుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సగటు ఓటింగ్ 45శాతం నుండి 50శాతం లోపే ఉండటానికి ప్రధాన కారణం ఓటర్ల జాబితాలోని అడ్డగోలు లోపాలేనని ఈ నిరంతర తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో బూత్ లెవెల్ అధికారులు కేవలం ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఒక సాధారణ గుర్తింపు పత్రాన్ని చూసి ఓట్లు నమోదు చేసేవారు. దీనివల్ల ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు ఉండటం, చనిపోయిన వారి పేర్లు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వారి ఓట్లు కూడా జాబితాలో అలాగే ఉండిపోయాయి.
ప్రస్తుత కఠినమైన ‘స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్’లో అధికారులు పౌరసత్వం, స్థానికతను నిరూపించుకోవడానికి దశాబ్దాల నాటి మున్సిపల్ అసెస్మెంట్ రసీదులు, రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ వంటి పక్కా లీగల్ డాక్యుమెంట్లు అడుగుతున్నారు. పాతబస్తీలో తరతరాలుగా నివసిస్తున్న మెజారిటీ ముస్లిం పేద కుటుంబాలు అద్దె ఇళ్లలోనో, సరైన పత్రాలు లేని పాత ఇళ్లలోనో ఉంటుండటంతో ఈ పత్రాలు చూపించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రక్రియ ముగిసేసరికి పాతబస్తీలో భారీ సంఖ్యలో బోగస్, బల్క్ ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ ఓట్ల గల్లంతు భయం వెనుక ఎంఐఎం పార్టీ ఉనికికి సంబంధించిన పెద్ద రాజకీయ సంక్షోభం దాగి ఉంది. పాతబస్తీలో పోలింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ, అక్కడ నమోదయ్యే లాయల్ ఓట్ బ్యాంక్, బల్క్ ఓటింగ్ ఆధారంగానే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు దశాబ్దాలుగా ఏకపక్ష విజయాలను సాధిస్తూ వస్తున్నారు. ఈ ప్రత్యేక ప్రక్షాళన వల్ల లక్షలాది ఓట్లు తొలగిపోతే, ఎంఐఎం సంప్రదాయ ఓట్ బ్యాంక్ ఛిన్నాభిన్నమవుతుంది.
రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సీట్ల సంఖ్య దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది. ఓటర్ల జాబితాలో నకిలీలు ఏరివేస్తే, ఓవైసీ కుటుంబానికి పాతబస్తీపై ఉన్న తిరుగులేని రాజకీయ పట్టు సడలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
తమ రాజకీయ కోటను కాపాడుకునేందుకు రంగంలోకి దిగిన ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహానికి తెరలేపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకకపోవడంతో, ఎంఐఎం ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162ని ఉపయోగించి, కర్ణాటక ప్రభుత్వం సకల సేవల చట్టం-2011 కింద జారీ చేస్తున్నట్లుగా, ఇక్కడి ఓటర్లకు కూడా శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు లేదా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఓవైసీ డిమాండ్ చేస్తున్నారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న బ్లాక్మెయిల్ రాజకీయంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు.
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఈ శాశ్వత నివాస ధృవీకరణ డిమాండ్‌పై అత్యంత వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారు. తెలంగాణలో స్థానికత అనేది సెంటిమెంట్‌తో కూడిన అంశం కావడంతో, ఎంఐఎం అడిగినట్లు హడావుడిగా శాశ్వత నివాస పత్రాలు జారీ చేస్తే అది రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారి తీస్తుంది, పైగా బీజేపీ దీనిని ప్రధాన ఆయుధంగా మార్చుకుంటుంది. చట్టపరంగా ఓటర్ల జాబితా సవరణ అనేది పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోని అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏదేమైనా, ఈ స్పెషల్ రివిజన్ ప్రక్రియ పూర్తయ్యే సరికి పాతబస్తీ రాజకీయ చిత్రపటంలో ఓవైసీ మార్క్ ఏకపక్షాధిపత్యానికి బ్రేకులు పడటం ఖాయంగా కనిపిస్తోంది.








