ఆరేళ్ల మనవరాలికి స్టీరింగ్ ఇచ్చిన ఎస్సై..! చివరకు ఏమైందంటే..!!?
సమాజంలో శాంతిభద్రతలను కాపాడాలి, పౌరులను ప్రమాదాల బారిన పడకుండా రక్షించాలి, చట్టాన్ని అతిక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాలి… ఇవీ ఖాకీ చొక్కా వేసుకున్న ప్రతి పోలీస్ అధికారి ప్రాథమిక బాధ్యతలు. కానీ, అదే చట్టాన్ని రక్షించాల్సిన ఓ అధికారి, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా, అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే? కంచే చేను మేసిన చందంగా, తనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడితే? సరిగ్గా ఇలాంటి బాధ్యతారాహిత్య ఘటనే సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో వెలుగుచూసి, సమాజాన్ని నివ్వెరపరిచింది.
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ-బైరాగిగూడ రహదారి అది. ఎప్పుడూ వాహనాల రద్దీతో, రాకపోకలతో బిజీగా ఉండే ఆ మార్గంలో ఒక కారు వెళ్తోంది. అయితే ఆ కారు స్టీరింగ్ పట్టుకుంది ఎవరో అనుభవం ఉన్న డ్రైవర్ కాదు, కనీసం వాహనం నడపడానికి అర్హత ఉన్న మైనర్ కూడా కాదు… కేవలం ఆరేళ్ల పసిపిల్ల! అవును, మీరు చదివింది నిజమే. కనీసం బ్రేక్ పెడల్ ఎక్కడుందో కూడా తెలియని వయసు, అసలు రోడ్డుపై వెళ్లే వాహనాల వేగంపై కనీస అవగాహన లేని ఆ పసిప్రాయం చేతికి కారు స్టీరింగ్ ఇచ్చి డ్రైవింగ్ చేయిస్తున్నాడు సదరు అధికారి.
ఈ దారుణాన్ని గమనించిన తోటి వాహనదారులు విస్తుపోయారు. పసిపిల్లల చేతికి స్టీరింగ్ ఇచ్చి రోడ్డుపైకి వదిలితే, తమ ప్రాణాలకు గ్యారెంటీ ఏంటని సదరు కారును అడ్డుకుని నిలదీశారు. అక్కడే అసలైన ట్విస్ట్ వెలుగుచూసింది. ఆ కారులో ఉన్నది మరెవరో కాదు, నార్సింగి పోలీస్ స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పూజారి తిరుపతి. తన ఆరేళ్ల మనవరాలికి స్టీరింగ్ ఇచ్చి ఆయన ఈ సాహసానికి ఒడిగట్టారు. పౌరులు ప్రశ్నిస్తే తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాల్సింది పోయి… “మా తాత పోలీస్ ఆఫీసర్” అని ఆ చిన్నారి అమాయకంగా సమాధానమివ్వడం, దానికి శృతి కలుపుతూ “ఇది ఆటో-గేర్ కారు, నా కంట్రోల్లోనే ఉంది” అని సదరు ఎస్సై తన తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చూస్తుంటే, అధికార మదం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది. చట్టం నా జేబులో ఉంది, నన్నెవరు అడుగుతారు అనే అహంకారం కాకపోతే, ఇంతటి రద్దీ రోడ్డుపై ఇలాంటి నిర్వాకానికి ఎలా పాల్పడతారు?
పౌరుల నిలదీత, ఆపై సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో.. ఎట్టకేలకు చట్టం తన పని తాను చేసింది. ఎస్సై తిరుపతిపై నార్సింగి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడం సరే, కానీ అసలు ప్రశ్న సమాజంలో ఉన్న బాధ్యత గురించే! చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే ఇలాంటి పనులకు పాల్పడితే, సామాన్య ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నట్లు? రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించే వారికి వీరు ఏ ముఖం పెట్టుకుని జరిమానాలు విధిస్తారు?
సమాజంలో మార్పు రావాల్సింది కేవలం సామాన్య ప్రజల్లో మాత్రమే కాదు, ఆ చట్టాలను అమలు చేసే వ్యవస్థల్లో కూడా. అధికార హోదా అనేది సమాజంపై పెత్తనం చెలాయించడానికి కాదు, సమాజానికి ఆదర్శంగా నిలవడానికి అనే విషయాన్ని ప్రతి ఒక్క అధికారి గుర్తుంచుకోవాలి. ఈ ఘటన కేవలం ఒక ఎస్సైపై కేసు నమోదుతో ముగిసిపోకూడదు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి చట్టాన్ని అపహాస్యం చేసే ప్రతి ఒక్కరికీ ఇదొక హెచ్చరిక కావాలి. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడే సమాజానికి భద్రత ఉంటుంది.








