నాగబంధం ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే గ్రేట్ విజువల్ ఫాంటసీ అడ్వెంచర్ : డైరెక్టర్ అభిషేక్ నామా
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ విజువల్ వండర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిషేక్ నామా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నాగబంధం ఆలోచన ఎప్పుడు వచ్చింది? మీ ఇన్స్పిరేషన్ ఏమిటి?
-పద్మనాభస్వామి ఆలయంలో వాల్ట్ బి ఎందుకు తెరవలేదనే విషయంలో చాలా చర్చలు జరిగాయి. దానిపై ఎన్నో కథలు ఉన్నాయి. ఆ గదిలోపల ఏముందనేది అందరికీ ఎంతో ఆసక్తికరం. నిజంగా ఆ గది తెరిస్తే అందులో ఏముంటుందో ఊహిస్తూ ఒక కథ చేస్తే బాగుంటుందని అనిపించింది. దాన్ని బ్యాక్‌డ్రాప్‌గా తీసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీ చేయాలనిపించింది. అలా నాగబంధం కథను రాశాను.
ఇలాంటి కథలకు పెద్ద హీరోలు అయితే బాగుంటుంది కదా. మీరెందుకు కొత్తవాళ్లతో చేశారు?
-నిజానికి ఈ కథ అనుకున్నప్పుడు ఎవరితో చేయాలనే ఆలోచన లేదు. మంచి కథ చెప్పడంపైనే నా దృష్టి అంతా ఉంది. కథ పూర్తయిన తర్వాత దానికి ఎవరు బాగా సరిపోతారో వారిని ఎంపిక చేశాం.
-ఇది నేను విజువలైజ్ చేసుకున్న కథ. నా విజన్‌ను నేనే డైరెక్ట్ చేస్తే బాగుంటుందని దర్శకత్వం వహించాను. చాలా పెద్ద కాన్వాస్ ఉన్న కథ ఇది. నేను అనుకున్న సమయానికే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాను. ముందుగా అనుకున్నట్లే 107 రోజుల్లో సినిమాను పూర్తి చేశాను. ఈ సినిమాలోని కాన్సెప్ట్స్ అన్నింటినీ నేనే డిజైన్ చేశాను.
అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని సెట్ వేశారు కదా. ఆ అనుభవం గురించి చెప్పండి?
-మేము అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లాము. అయితే అక్కడ ఫొటోలు తీసుకునేందుకు అనుమతి ఉండదు. అందుకే అక్కడ చూసిన వాటిని స్కెచ్‌ల రూపంలో పేపర్‌పై రూపొందించుకున్నాం. ఆ తర్వాత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని, వేరే ఆర్కిటెక్చర్‌ను కూడా జోడించి ఆ సెట్‌ను డిజైన్ చేశాం.
-అయితే ఈ సినిమా కోసం మేము అనంత పద్మనాభస్వామి ఆలయం అనే పేరును వాడడం లేదు. అదొక ఫిక్షనల్ టెంపుల్గానే చూపించాం. ఇది ఒక ఫిక్షనల్ ట్రెజర్ హంట్ కథ, దాన్ని ఫాంటసీ కోణంలో చెప్పాం.
విరాట్ కర్ణలాంటి కొత్త హీరోతో వంద కోట్లకు పైగా సినిమా చేయడం వెనుక కారణం?
-నిజానికి ఈ కథ మొదలుపెట్టినప్పుడు వంద కోట్ల బడ్జెట్ అవుతుందని అనుకోలేదు. కొత్త నటుడితో సినిమా చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఇది కథ మీద నడిచే సినిమా. పెద్ద హీరో ఉంటే కొన్ని అంచనాలు ఉంటాయి. అందుకే కొత్త హీరో అయిన విరాట్ కర్ణను ఎంపిక చేశాను.
-మేము రియల్ టెంపుల్స్ షూట్ చేయాలని అనుకున్నాం. కానీ అనుకున్నంతగా అనుమతులు దొరకలేదు. దీంతో టెంపుల్ సెట్ వేయాల్సి వచ్చింది. సెట్స్, ఆర్ట్ వర్క్, మేకప్, సిజీ విషయంలో బడ్జెట్ కూడా పెరిగింది.
-ఈ సినిమాలో మొత్తం ఎనిమిది సెట్లు ఉన్నాయి. ఈ సినిమా కోసం మేం పెట్టిన ఖర్చులో ఎక్కువ భాగం ఆర్ట్‌వర్క్, సెట్స్, సీజీకే వెళ్లింది. 20 శాతం రెమ్యూనరేషన్లకు, 80 శాతం ప్రొడక్షన్‌కు ఖర్చు చేశాం.
నిర్మాతల గురించి?
-మా నిర్మాతలు మొదటి నుంచి కథను, నన్ను పూర్తిగా నమ్మి సినిమా కోసం ఖర్చు చేశారు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా కథకు ఏం అవసరమో అది అందించారు. ఈ విషయంలో వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో చాలా హ్యాపీగా వున్నారు.
-నిర్మాతలు రాకముందే ఈ సినిమాకు పకడ్బందీగా ప్రీ-ప్రొడక్షన్ చేశాను. సినిమా ఎలా ఉండబోతోంది, విజువల్స్ ఎలా ఉంటాయో ముందుగానే వారికి చూపించాను. అందుకే వారికి పూర్తి క్లారిటీ వచ్చింది.
మైథాలజీ అంశాలతో సినిమా చేయడం పెద్ద టాస్క్ కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
-ఇది మైథాలజీ మాత్రమే కాదు, ఒక కమర్షియల్ సినిమా కూడా. కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ప్రతి విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాం. ఈ సినిమాకు కథే హీరో.
-ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఫైనల్ అవుట్‌పుట్ చూసుకున్న తర్వాత చాలా సంతృప్తి కలిగింది.
హిందీలో ఎలాంటి స్పందన ఉంది?
-బాలీవుడ్లో చాలా మంచి స్పందన వచ్చింది. దాదాపు 700కి పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. తమిళంలో 200కి పైగా స్క్రీన్లలో విడుదల అవుతోంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500కి పైగా స్క్రీన్లలో సినిమా విడుదల అవుతోంది. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత అన్ని బిజినెస్ డీల్స్ పూర్తయ్యాయి.
ఇంత భారీ సినిమా చేయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు?
-డెవిల్ తర్వాత ఒక కథ చేయాలనుకున్నాను. కొంతకాలం దానిపైనే ప్రయాణించాను. అయితే చేస్తే అందరూ గుర్తుపెట్టుకునే పెద్ద సినిమా చేయాలనిపించి ఈ సినిమాను మొదలుపెట్టాను.
మీరు సినిమా రంగంలోకి, దర్శకత్వంలోకి అనుకోకుండా వచ్చారా?
-మా నాన్నగారు ఫిలిం డిస్ట్రిబ్యూటర్. ఆయన ఎప్పుడూ నన్ను ఆఫీసుకు రానివ్వలేదు. ఈ వ్యాపారమే వద్దని చెప్పేవారు. నేను ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాను. కానీ సినిమా అనే ప్యాషన్ నన్ను ఈ వైపు లాగింది. మొదట్లో చాలా ఇంగ్లీష్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. నేను చదివింది ఆర్ట్స్, కానీ చేస్తున్న పని మొత్తం బిజినెస్ అయిపోయింది. సినిమాలో ఏం జరుగుతుందో, ఎలా తీస్తారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సినిమా నిర్మించడం మొదలుపెట్టాను. నిర్మాతకు కూడా పూర్తిగా ఏం జరుగుతుందో తెలియదని అర్థమైంది.(నవ్వుతూ) 100 శాతం ఇన్వాల్వ్ అయితేనే అసలు విషయం తెలుస్తుంది. అలా దర్శకత్వం వైపు వచ్చాను.
-నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా వచ్చిన అనుభవంతో ఈ సినిమాకు అన్ని విషయాల్లో నిర్మాతలకు సహకరించాను.
ఈ సినిమాల్లో పాత్రల గురించి?
-నభా నటేష్ నవ పార్వతి అనే పాత్రలో నటిస్తోంది. ఆమె ఒక వేద విద్యార్థిని పాత్రలో చాలా చక్కగా నటించింది.
-ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. ఇందులో ఒక పాత్ర చేసిన గరుడ రామ్ రాత్రి ఒంటిగంటన్నరకు సెట్‌కు వచ్చి ఉదయం ఏడు గంటల వరకు మేకప్ వేయించుకునేవారు. దాదాపు 20 కిలోల మేకప్ ఉండేది. ఆ మేకప్‌తో భోజనం కూడా చేయలేని పరిస్థితి.
-అలాగే జగపతిబాబు గారు కూడా అద్భుతంగా నటించారు. నీటిలో రాత్రిపూట జరిగే సన్నివేశాలను ఎంతో కష్టపడి చేశారు.
-మా హీరో విరాట్ కర్ణ కూడా శరీరంపై ఎలాంటి వస్త్రాలు లేకుండా చలికాలంలో రాత్రిపూట షూటింగ్ చేశారు. ఎలాంటి డూప్ లేకుండా అడ్వెంచర్, యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ప్రతి విషయంలో చాలా కష్టపడ్డారు. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను.
సంగీతం గురించి?
జునైద్, అభి కొత్తవారైనా చాలా అద్భుతమైన సంగీతం అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా గ్రాండ్‌గా ఉంటుంది. పాటలన్నీ కమర్షియల్ ప్యాటర్న్‌లో ఉంటాయి.
కొత్త సినిమా ప్లాన్స్?
నాగబంధం 2 చేసే ఆలోచన ఉంది. సీక్వెల్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉన్న కథ ఇది.








