మెస్సీ, రొనాల్డోలకు అందనిఎత్తులో ఎంబాప్పే..!
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్, రియల్ మాడ్రిడ్ ఫార్వర్డ్ కిలియన్ ఎంబాప్పే ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup 2026) లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మంగళవారం జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో స్వీడన్‌పై ఫ్రాన్స్ 3-0తో ఘన విజయం సాధించి నాకౌట్ చేరింది. ఈ మ్యాచ్‌లో ఎంబాప్పే రెండు అద్భుతమైన గోల్స్ చేయడమే కాకుండా, ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ చరిత్రలోనే అత్యధికంగా 10 గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ రెండు గోల్స్‌తో ఎంబాప్పే.. బ్రెజిల్ దిగ్గజాలు రొనాల్డో నాజారియో, లియోనిడాస్ (తలా 8 గోల్స్) రికార్డులను అధిగమించాడు. అంతేకాదు, జర్మనీ ఐకాన్ మిరోస్లావ్ క్లోజ్ రికార్డును కూడా దాటేసి ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18 కి పెంచుకున్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు 6 గోల్స్ చేసిన ఎంబాప్పే.. అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీతో కలిసి గోల్డెన్ బూట్ (Golden Boot) రేసులో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్వీడన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎంబాప్పే సాధించిన రెండు గోల్స్ వెనుక ఫ్రాన్స్ ప్లేమేకర్ మైఖేల్ ఒలిసే అద్భుతమైన సహకారం (Assists) ఉంది.
ఈ మ్యాచ్‌లో ఒలిసే అసిస్ట్‌ల హ్యాట్రిక్ సాధించగా, అందులో రెండు పాస్‌లను ఎంబాప్పే తన ట్రేడ్‌మార్క్ వేగంతో, మెరుపు ఫినిషింగ్‌తో గోల్స్‌గా మలిచాడు. ప్రస్తుతం ఈ టోర్నమెంట్లో 5 అసిస్ట్‌లతో ఒలిసే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 19 గోల్స్ చేసిన రికార్డు మెస్సీ పేరిట ఉన్నప్పటికీ, నాకౌట్ మ్యాచ్‌ల విషయానికి వస్తే మెస్సీ కేవలం 5 గోల్స్ మాత్రమే చేయగలిగాడు. ఇక అతని చిరకాల ప్రత్యర్థి క్రిస్టియానో రొనాల్డో అయితే తన కెరీర్లో ఇప్పటివరకు వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం గమనార్హం. జులై 4న జరగబోయే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జర్మనీని ఓడించి సంచలనం సృష్టించిన పరాగ్వేతో ఫ్రాన్స్ తలపడనుంది.








