చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ..? పోలీసుల సంచలన నిర్ణయం..!
కాకినాడ(Kakinada) జిల్లాలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. రోజులు గడుస్తున్నా లభించని చిన్నారి ఆచూకీ కోసం కాకినాడ జిల్లా పోలీసులు సరికొత్త కార్యాచరణను రంగంలోకి దించారు. జ్ఞానేశ్వరి ఆచూకీని విజయవంతంగా కనుగొని సమాచారం అందించిన వారికి రూ. 1 లక్ష నగదు బహుమతి (రివార్డ్) ఇస్తామని జిల్లా ఎస్పీ అధికారికంగా ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, ప్రజలందరూ ఈ శోధనలో భాగస్వామ్యం కావాలని పోలీసులు కోరారు.
చిన్నారిని గుర్తించేందుకు పోలీసులు ఒక ప్రత్యేక వాల్ పోస్టర్ను విడుదల చేశారు. జ్ఞానేశ్వరి ఫోటో మరియు ఆనవాళ్లతో కూడిన ఈ పోస్టర్లను కేవలం కాకినాడలోనే కాకుండా, పొరుగున ఉన్న పలు జిల్లాల్లోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో విస్తృతంగా ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జ్ఞానేశ్వరి కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ.. ఆచూకీని త్వరగా కనుగొనేందుకు ఏకంగా 12 ప్రత్యేక బృందాలను (Special Teams) రంగంలోకి దించింది.
ఈ బృందాలు అనుమానాస్పద ప్రాంతాలను, సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నాయి. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీకి సంబంధించి ఎలాంటి చిన్న సమాచారం దొరికినా.. తక్షణమే స్థానిక పోలీసులకు లేదా పోస్టర్లలో సూచించిన నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఏపీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా పాపను ఏదైనా అడవి జంతువు ఎత్తుకెళ్లిందా అనే కోణంలో అటవీ శాఖ సహాయంతో విచారణ చేపట్టారు. ఇందుకోసం థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలను వాడటంతో పాటు.. జంతువులను ఆకర్షించడానికి మాంసంతో కూడిన రెండు డమ్మీ బొమ్మలను సైతం తోటలో ఉంచి నిఘా పెట్టారు.








