మంగళగిరిలో క్రికెట్ సంబరం… ఏపీఎల్ 2026 ఫైనల్ కు హాజరైన మంత్రి లోకేశ్
మంగళగిరి ACA అంతర్జాతీయ స్టేడియంలో APL ఫైనల్ సందడి
టాస్ వేసి తుది పోరును ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
ఆధునీకరించిన మంగళగిరి ACA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్మారక ఫలకాన్ని ఆవిష్కరించిన యువనేత
మంగళగిరి:- మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం క్రికెట్ అభిమానుల కోలాహలంతో మారుమోగుతుంది. వేలాది మంది అభిమానుల కేరింతలు, ఉత్సాహభరిత వాతావరణం మధ్య నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) ఫైనల్ పోరు క్రీడా సంబరాలను తలపిస్తుంది. సింహాద్రి వైజాగ్ లయన్స్ మరియు భీమవరం బుల్స్ (Bhimavaram Bulls) జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర ఐటీ, మానవవనరులు, ఆర్టీజీఎస్ (RTGS) శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ (Nara Lokesh) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాస్ వేసి తుది పోరును యువనేత లోకేష్ ప్రారంభించారు. టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్లో పాల్గొంటున్న ఇరు జట్ల ఆటగాళ్లకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు.
దీనికి ముందు ఆంధ్రప్రదేశ్లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచేలా మంగళగిరిలోని ACA క్రీడా ప్రాంగంణంలో ఆధునీకరించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్(చిన్ని), ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు, ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, సంయుక్త కార్యదర్శి బోయల్ల విజయ్ కుమార్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ విష్ణు దంతు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, క్రీడాకారులు పాల్గొన్నారు.








