లింగం’ OTT రివ్యూ: క్రైమ్ ప్రపంచంలోకి తీసుకెళ్లే మరో రొటీన్ కథ
—సూర్య ప్రకాష్ జోశ్యుల
కన్యాకుమారి… బయటివాళ్లకు అది మూడు సముద్రాలు కలిసే పుణ్యక్షేత్రం. కానీ అక్కడి ఫిషింగ్ హార్బర్లలో మాత్రం మరో ప్రపంచం నడుస్తోంది. లోకల్ గా కడప్పురం ప్రాంతాన్ని చెల్ల పాండియన్, నాగర్‌కోయిల్ ప్రాంతాన్ని సామియప్పన్ తమదిగా చేసుకుని ఆధిపత్యం చెలాయిస్తూంటారు. మధ్య మధ్యలో ఒకరి ప్రాంతంలో మరొకరు అడుగు పెట్టి గొడవలకు తెర లేపుతూంటారు. దాంతో అక్కడ ప్రతి గొడవ రక్తంతోనే ముగుస్తుంది.
అలాంటి చోటే ముత్తులింగం(కథిర్) తన తల్లితో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అతని కల ఒక్కటే. పోలీస్ కావాలి. దాన్ని స్పోర్ట్స్ కోటాలో కొట్టాలని కబడ్డీని తన భవిష్యత్తుగా మార్చుకుంటాడు. ఆ ప్రాంతంలో అతడిని ఓడించే ఆటగాడు లేడని చెప్పేటంత పేరు తెచ్చుకుంటాడు. అలాగే అతనికో లవర్ మలర్ (దివ్యభారతి) . అంతా బాగానే సాగుతోంది. రేపో మాపో ఉద్యోగం కొట్టేస్తాడు… పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యిపోతాడు అని అందరూ భావిస్తారు. అయితే విధి దగ్గర మాత్రం ముత్తులింగం విషయంలో వేరే ప్లాన్స్ ఉన్నాయి.
ఆ రోజు గ్రామ జాతర సందర్బంగా కబడ్డీ పోటీలు జరుగుతాయి… అక్కడే హింస శృతి మించి ముఠా తగాదాలు జరుగుతాయి. ఆ గొడవలో మార్టిన్ అనే రౌడీ, గుణశీలన్ అనే మరో రౌడీను కత్తితో చంపేస్తాడు. సరిగ్గా అదే చోట ముత్తులింగం నిలబడి ఉండటంతో “హత్య చేసింది ఇతడే.” అని పోలీసులు తీసుకెళ్లిపోతారు. చేయని నేరానికి జైలుకు వెళ్లిన ముత్తు లింగం బెయిల్‌పై బయటికి వచ్చేసరికి ఒక నిజం అర్థమైంది. పోలీసులు తననే గమనిస్తున్నారు. చనిపోయిన గుణశీలన్ అనుచరులు కూడా తన రక్తం కోసం వెతుకుతున్నారు.
ఈ సిట్యువేషన్ ని క్యాష్ చేసుకుందామనుకున్నాడు చెల్ల పాండియన్. ముత్తు లింగాన్ని పిలిచి చేరదీసాడు. ముత్తు లింగానికి వేరే ఆప్షన్ లేదు. మొదట అది ఆశ్రయం మాత్రమే అనుకున్నాడు. తర్వాత అదే జీవితం అయ్యిపోయింది. ఆ తర్వాత… ముత్తులింగం క్రైమ్ లో కబడ్డీ ఆడటం మొదలెట్టాడు. రోజులు గడుస్తున్నాయి.
“నేర ప్రపంచంలో ఒకసారి అడుగు పెడితే… వెనక్కి వచ్చే దారి ఉండదు” అనే మాట నిజం. ముత్తులింగం అండతో… చెల్ల పాండియన్ బలపడ్డాడు. అది చూసిన సామియప్పన్ చివరకు ఒక భయంకరమైన ప్రకటన చేసాడు. “చెల్ల పాండియన్… ముత్తులింగం ఇద్దరినీ చంపినవారికి నా ఆస్తిలో సగం ఇస్తాను.” అని. అప్పుడు ఏమైంది.. ముత్తులింగం తప్పించుకోగలిగాడా.. కథలోని అసలు ట్విస్ట్ ఏమిటి తెలుసుకోవాలంటే వెబ్ సీరిస్ చూడాల్సిందే.
విశ్లేషణ
ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ కథలకు ఒక రెడీమేడ్ ఫార్ములా దొరికిపోయింది. హీరో చేతిలో కత్తి పెట్టండి… రెండు మూడు స్లో మోషన్ షాట్లు వేయండి… బ్యాక్‌గ్రౌండ్‌లో డప్పులు మోగించండి… ప్రతి పది నిమిషాలకు ఒక తల నరికేయండి… అంతే, ‘రా అండ్ రస్టిక్’ అనే స్టిక్కర్ వేసి ఓటీటీలో వదిలేయండి. కానీ ప్రేక్షకుడు ఇప్పుడు కత్తుల లెక్క కాదు… కథలో కొత్తదనం లెక్కేస్తున్నాడు. అది చాలామంది మర్చిపోతున్నారు.
లింగం కూడా అదే పాత ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అయితే అది మనని ఆశ్చర్యపరుస్తుందా? అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఎలా అంటే..ఇంకా ఇంత రొటీన్ గానే సినిమాలు, సీరిస్ లు తీస్తున్నారా అనిపించేలా.
దర్శకుడు Christopher Nolan ఒకసారి ఇలా అన్నాడు. “Every story has been told before. The challenge is making the audience forget that.”
ఇక్కడే లింగం దెబ్బతింది. ప్రేక్షకుడు ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన ఈ కథని… కొత్త మలుపులు, బలమైన ట్విస్టులు, లోతైన పాత్రలు, భావోద్వేగాలతో మళ్లీ చెప్పాల్సింది. అది జరగలేదు. ఈ కథలో జరిగే ప్రతి మలుపు ముందే ఊహించవచ్చు. దాంతో ప్రతి ఎపిసోడ్ ముగిసిన తర్వాత “తర్వాత ఏమవుతుంది?” అనే ప్రశ్న కంటే… “ఇదే కదా తర్వాత వచ్చేది” అనుకుంటూ చూస్తూంటాం.
కథే బలవంతపెట్టింది
మంచి స్క్రీన్‌ప్లేలో కథను పాత్ర నడిపిస్తుంది. పాత్ర తీసుకున్న ప్రతి నిర్ణయం కొత్త సమస్యను సృష్టిస్తుంది. కానీ ‘లింగం’లో మాత్రం చాలా కీలక మలుపులు హీరో నిర్ణయాల వల్ల కాకుండా పరిస్థితుల వల్ల వస్తాయి. చేయని హత్య కేసులో ఇరుక్కోవడం, గ్యాంగ్‌లో చేరడం, నేర ప్రపంచంలోకి దిగడం… ఇవన్నీ అతను ఎంచుకున్న మార్గాల కంటే, కథ అతన్ని తోసిన దారుల్లా అనిపిస్తాయి. అందుకే లింగం ప్రయాణం ఆసక్తికరంగా కనిపించినా, అతని నిర్ణయాల బరువు మనకి పూర్తిగా అనుభూతి కావడం లేదు.
ఇక హీరో లింగం పాత్రకు క్యారెక్టర్ ఆర్క్ బాగుంది… కానీ డెప్త్ లేదు. పోలీస్ కావాలనుకున్న యువకుడు…అదే పోలీసులకు వేటగా మారడం… అక్కడి నుంచి గ్యాంగ్ లీడర్‌గా ఎదగడం… ఇది గొప్ప క్యారెక్టర్ ఆర్క్. కానీ… అతని మానసిక సంఘర్షణలను స్క్రీన్‌ప్లే ఎక్కువగా పట్టించుకోని ఆర్క్ వర్కవుట్ కాదు.
అలాగే ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామానే కానీ అందులో ఆశ్చర్యపరిచే రాజకీయాలు లేవు. ఫిషింగ్ హార్బర్ రాజకీయాలు, అక్రమ వ్యాపారాలు, స్థానిక నాయకుల ప్రభావం… ఇవి కథకు మంచి ప్రపంచాన్ని నిర్మిస్తాయి. కానీ… ఆ ప్రపంచాన్ని లోతుగా వెళ్లకుండా పదే పదే కథనాన్ని కత్తులు, హత్యలు, ప్రతీకారాల చుట్టూనే తిప్పారు.
ఎంత విసుగు వస్తుందంటే… కొన్ని ఎపిసోడ్ల తర్వాత… హత్యలు కూడా రొటీన్‌గా అనిపించడం మొదలవుతుంది. ఎమోషన్స్ కు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. ప్రేక్షకుడు… హీరో కత్తితో చేసే పోరాటం కంటే… మనసుతో చేసే పోరాటాన్నే ఎక్కువ గుర్తుంచుకుంటాడనే విషయం మర్చిపోయారు.
స్క్రీన్‌ప్లే సంగీతంలాంటిది. ప్రేక్షకుడికి ఎప్పుడు టెన్షన్ ఇవ్వాలి… ఎప్పుడు రిలీఫ్ ఇవ్వాలి… ఎప్పుడు షాక్ ఇవ్వాలి… అనే రిథమ్ ఇందులో కనిపించదు. రొట్టకొట్టుడుగా ఈ సీన్ లో హింస వస్తుందా రాదా అనేది చూసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోయారు. దాంతో ఎపిసోడ్స్ దాదాపు అన్నీ ఒకే టోన్. దాంతో చూసే మనం అలసిపోతాం. ఏ సీన్ తర్వాత కూడా “అరే… అప్పుడే Hint ఇచ్చారు.” అనిపించే మూమెంట్ లేదు Foreshadowing అసలు లేనే లేదు.
ముఖ్యంగా అసలు ఈ సీరిస్ Theme ఏంటి? అనే క్లారిటీ ఇవ్వరు. Revenge? , Power?, Crime?, Destiny? లేక Corruption? సిరీస్ క్లియర్ Theme చెప్పదు. దాంతో సీన్స్ అన్ని కలిపిన ఎపిసోడ్స్ లా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా?
దినేశ్ కుమార్ సినిమాటోగ్రఫీ 1980ల వాతావరణాన్ని బాగా పట్టుకుంది. నివాస్ కె ప్రసన్న నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాల్లో టెన్షన్‌ను పెంచుతుంది. ఎడిటింగ్ కూడా ఫర్వాలేదు. నటీనటులు బాగానే చేసారు. డైలాగులు కొన్ని బాగున్నాయి. కొన్ని చోట్ల డబ్బింగ్ వాసన బాగా తగిలింది.
ఫైనల్ థాట్
ఒకప్పుడు ఓటీటీ అంటే కొత్త కథలకు చిరునామా. ఇప్పుడు కొన్ని సిరీస్‌లు చూస్తుంటే, థియేటర్లో రిటైర్ అయిన క్రైమ్ కథలకు కొత్త అడ్రస్‌గా మారిందేమో అనిపిస్తోంది. కథలు మారడం లేదు… మారేది కేవలం రిలీజ్ ప్లాట్‌ఫామ్ మాత్రమే.
ఎక్కడ చూడచ్చు
జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉంది.








