ట్యాంకులు లేవు.. సైనికులు రారు.. ఒక్క చిన్న క్లిక్‌తో సర్వనాశనం! ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా కొత్త AI!
Artificial Intelligence: ఒకప్పుడు దేశాలు క్షిపణులు తయారు చేసేవి… తర్వాత అణ్వాయుధాలతో ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేశాయి… ఇప్పుడు అదే పోటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మళ్లుతోంది. ఎందుకంటే… భవిష్యత్తులో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే జరగకపోవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థపై దాడి… విద్యుత్ గ్రిడ్‌ను నిలిపివేయడం… ప్రభుత్వ వెబ్సైట్లను స్తంభింపజేయడం… స్టాక్ మార్కెట్లను గందరగోళంలోకి నెట్టడం… కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను దెబ్బతీయడం… ఇవన్నీ సైబర్ యుద్ధంలో భాగమయ్యే అవకాశాన్ని భద్రతా నిపుణులు చాలాకాలంగా చర్చిస్తున్నారు. ఇలాంటి దాడులు చేసే సైబర్ నేరగాళ్లు లేదా శత్రు గుంపుల చేతికి మరింత శక్తివంతమైన AI టూల్స్ చేరితే… దాడుల వేగం, స్థాయి, నాణ్యత పెరిగే అవకాశం ఉందన్నదే ఇప్పుడు వ్యక్తమవుతున్న ప్రధాన ఆందోళన. అందుకే చైనాకు చెందిన GLM-5.2 వంటి అత్యాధునిక ఓపెన్-సోర్స్ AI మోడళ్లపై ప్రపంచ ఇంటెలిజెన్స్ సంస్థలు నిశితంగా నిఘా పెడుతున్నాయి. రేపటి యుద్ధం బుల్లెట్లతో కాకపోవచ్చు… కోడ్‌తో జరగొచ్చు. ట్యాంకులతో కాకపోవచ్చు… ఆల్గోరిథమ్‌లతో సాగొచ్చు. దేశాన్ని జయించడానికి సరిహద్దు దాటాల్సిన అవసరం లేకపోవచ్చు… ఆ దేశం డిజిటల్ వ్యవస్థను కూల్చేస్తే చాలు.
ఒక్క మెసేజ్… ఒక్క క్లిక్… ఒక్క చిన్న పొరపాటు!
బ్యాంక్ పేరుతో ఓ SMS వస్తుంది… “KYC Update చేయండి…”, “మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది…”, “₹49,999 రిఫండ్ పెండింగ్…” ఆలోచించకుండా లింక్ ఓపెన్ చేస్తారు. రెండు నిమిషాల్లో OTP… ఐదు నిమిషాల్లో బ్యాంక్ ఖాతా ఖాళీ… పది నిమిషాల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటారు. ఇదే ఇప్పుడు భారతదేశంలో లక్షల మంది ఎదుర్కొంటున్న సైబర్ మోసాల కథ. ఇప్పుడు దీనికి AI తోడైంది. దాంతో హ్యాకర్స్ బాగా బలపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
“అసలు ఒక్క AI వల్ల హ్యాకర్లు ఎలా బలపడతారు?”
గతంలో వైరస్ రాయడానికి రోజులు పట్టేది. ఇప్పుడు AI కొన్ని నిమిషాల్లో డ్రాఫ్ట్ తయారు చేయగలదు. ముందు నకిలీ మెయిల్ రాయాలంటే ఇంగ్లీష్ రావాలి. ఇప్పుడు AI రాసిపెడుతుంది. ముందు ఫేక్ వెబ్సైట్ తయారు చేయడానికి డెవలపర్ కావాలి. ఇప్పుడు AI సహాయంతో పని వేగవంతం కావచ్చు.
ఆందోళన..
“ఈ AI గురించి టెన్షన్ పడుతున్నది సోషల్ మీడియా కాదు…సరదాగా కాలక్షేపం కోసం మాట్లాడుకునే వాళ్లూ కాదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థల కూటమి ‘ఫైవ్ ఐస్’ సీన్ లోకి వచ్చింది. ఈ ‘ఫైవ్ ఐస్’ ఇప్పుడు చైనాకు చెందిన ఒక కొత్త AI మోడల్‌పై హెచ్చరికలు జారీ చేసింది.
భారత్‌లో పరిస్థితి ఎంత సీరియస్?
“ఇది విదేశాల్లో జరిగేది… మనకేం?” అనుకుంటే పొరపాటే. భారత్‌లోనే 2023లో 11.5 లక్షలకు పైగా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువ భాగం ఆర్థిక మోసాలే. 2025లో భారతీయులు సైబర్ మోసాల్లో దాదాపు ₹22,495 కోట్ల వరకు నష్టపోయినట్లు అధికారిక గణాంకాలను ఆధారంగా వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. అందులో కూడా అత్యధిక నష్టం పెట్టుబడి పేరుతో జరిగే మోసాల్లోనే నమోదైంది. అంటే… హ్యాకర్లు మనల్ని వెతకడం లేదు… మన డబ్బునే వెతుకుతున్నారు.
ఇప్పుడు ప్రపంచాన్ని ఎందుకు భయపెడుతోంది ఈ AI?
ఇప్పుడు ప్రపంచ భద్రతా సంస్థల చర్చ అంతా GLM-5.2 గురించే. దీనిని చైనాకు చెందిన Z.ai అభివృద్ధి చేసింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి AI మోడళ్లతో పోటీ పడగల కోడింగ్ సామర్థ్యం దీనికి ఉందని చెబుతున్నారు. అది సమస్య కాదు. అసలు సమస్య… ఇది ఓపెన్ సోర్స్ కావడమే.
ఓపెన్ సోర్స్ అంటే అంత భయమా?
కాదు… ఓపెన్ సోర్స్ అంటే ప్రమాదమని కాదు. కానీ… ఈ AIని ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉండటం వల్లే ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా కమర్షియల్ AI మోడళ్లలో భద్రతా నియంత్రణలు కంపెనీ చేతుల్లో ఉంటాయి. కానీ ఇక్కడ… ఆ నియంత్రణలను మార్చే అవకాశమే చర్చకు కారణమైంది. ChatGPTని OpenAI నియంత్రిస్తుంది. ప్రమాదకర ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఫిల్టర్లు ఉంటాయి. కానీ GLM-5.2 ఓపెన్ సోర్స్. అంటే… ఇంటి తాళం తయారు చేసి అందరికీ ఇచ్చినట్లే. ఆ తాళాన్ని ఎవరు ఎలా వాడుకుని , ఏం చేస్తారనేదే ఇప్పుడు ప్రపంచ ఆందోళన.
అందుకే 5 దేశాలు అలర్ట్ అయ్యాయా?
అమెరికా…
బ్రిటన్…
కెనడా…
ఆస్ట్రేలియా…
న్యూజిలాండ్…
ఈ ఐదు దేశాల ఇంటెలిజెన్స్ కూటమి ‘ఫైవ్ ఐస్’ ప్రకారం, కొందరు సైబర్ నేరగాళ్లు ఈ మోడల్‌ను దుర్వినియోగం చేసే మార్గాలను అన్వేషిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఆన్లైన్ ఫోరమ్‌లలో భద్రతా పరిమితులను ఎలా తొలగించాలనే చర్చలు కూడా జరిగినట్లు సైబర్ పరిశోధకులు గుర్తించారు.
మనకు వచ్చే ప్రమాదం ఏమిటి?
“నిన్న డిజిటల్ అరెస్ట్… ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ స్కామ్… రేపు AIతో తయారైన ఫేక్ వీడియో కాల్… మోసాల రూపం మారుతోంది. మారనిది ఒక్కటే… బాధితుడు మాత్రం సామాన్యుడే.”
ఇప్పటికే…
ఫేక్ బ్యాంక్ కాల్స్
KYC స్కామ్స్
WhatsApp మోసాలు
OTP ఫ్రాడ్స్
నకిలీ వెబ్సైట్లు
రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మరింత శక్తివంతమైన AIను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తే… మోసపూరిత ఇమెయిల్స్… ఫేక్ వెబ్సైట్లు… నమ్మించే మెసేజ్‌లు… మరింత వేగంగా, మరింత నమ్మదగినట్లుగా తయారయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చివరగా…
AIని ఆపడం ఎవరి వల్లా కాదు. కానీ AIని బాధ్యతగా ఉపయోగించడం మాత్రం ప్రపంచం నేర్చుకోవాల్సిందే. లేకపోతే టెక్నాలజీ మనిషి కోసం పనిచేసే సాధనంగా కాకుండా… సైబర్ నేరాలకు బలమిచ్చే ఆయుధంగా మారే ప్రమాదం ఉంది. రేపు AI మీకు ఉద్యోగం తెచ్చిపెట్టవచ్చు. అదే AI మీ బ్యాంక్ ఖాతాను టార్గెట్ చేసే నేరగాడి చేతిలో కూడా ఉండొచ్చు. అందుకే అసలు ప్రశ్న AI ఎంత తెలివైనది అనేది కాదు… దాన్ని ఎవరు వాడుతున్నారు అనేదే.








