టీమిండియాను వణికించిన ఎన్నారై బౌలర్..!
భారత క్రికెట్ జట్టును కోలుకోలేని దెబ్బతీసి, ఐర్లాండ్(Irland) చారిత్రాత్మక టీ20 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్ జై ముంద్రా ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారాడు. భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును దక్కించుకున్న ఈ బౌలర్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మైదానంలో వరల్డ్ క్లాస్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన ఈ స్టార్ ఆటగాడు.. నిజ జీవితంలో మాత్రం ఐటీ ఉద్యోగం కోసం లింక్డ్ఇన్ (LinkedIn) లో వేట సాగిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
భారత్‌తో జరిగిన రెండూ టీ20 మ్యాచ్‌ల్లో జై ముంద్రా అద్భుతమైన స్పెల్‌తో భారత బ్యాటింగ్ లైన్అప్ను కుప్పకూల్చాడు. ముఖ్యంగా రెండో టీ20లో ప్రమాదకరమైన టీమిండియా ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలను గోల్డెన్ డకౌట్లుగా వెనక్కి పంపడమే కాకుండా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కేవలం 10 పరుగులకే అవుట్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చాడు. మైదానంలో ముంద్రా వేసిన ఇన్స్వింగర్లు, అవుట్స్వింగర్ల దాటికి భారత బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.
జై ముంద్రా అసలు సిసలైన భారతీయుడు కావడం ఇక్కడ విశేషం. రాజస్థాన్‌లో జన్మించిన అతను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు 2021లో ఐర్లాండ్‌కు వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే స్థానిక క్రికెట్లో రాణించి ఐర్లాండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అంతర్జాతీయ వేదికపై ఐర్లాండ్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. అతను ఇప్పటికీ భారత పాస్‌పోర్ట్‌నే కలిగి ఉండటం గమనార్హం. ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత జై ముంద్రా ప్రముఖ టెక్ దిగ్గజం ‘ఇంటెల్’ సంస్థలో ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా పనిచేశాడు.
అయితే, 2025 జూన్‌లో ఆ ఉద్యోగాన్ని వదిలేసిన ఆయన.. ప్రస్తుతం ఐర్లాండ్, యూరప్ దేశాల్లో ఫుల్-టైమ్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. అతని లింక్డ్ ఇన్ ప్రొఫైల్‌లో “#OpenToWork” అనే బ్యాడ్జ్ ఉండటాన్ని చూసి నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. నిన్నటిదాకా ఇంటెల్ ఆఫీసులో కోడింగ్ రాసిన వ్యక్తి.. ఈరోజు ప్రపంచ ఛాంపియన్లయిన భారత ఆటగాళ్లను గాల్లోకి లేపేయడం అంటే మామూలు విషయం కాదంటూ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.








