మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం..! I
ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని ప్రతిష్టాత్మక పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఎన్నికల సమయంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పక్కాగా అమలు చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) నేతృత్వంలోని ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ రోజు ఉదయం నుంచే నిర్వాసిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా పరిహారం సొమ్ము జమ అవుతుండటంతో నిర్వాసిత గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
వెలిగొండ ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏకంగా రూ.300 కోట్ల భారీ మొత్తాన్ని విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 2,351 నిర్వాసిత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. నేరుగా బ్యాంకు ఖాతాల్లో (DBT) పడుతున్న ఈ ప్యాకేజీ కింద ఒక్కో నిర్వాసితుడికి రూ.12.50 లక్షల నుంచి రూ.12.76 లక్షల వరకు నగదు అందుతోంది. దశాబ్దాలుగా ముంపు భయంతో, సరైన పరిహారం అందక ఇబ్బంది పడుతున్న ముంపు గ్రామాల ప్రజలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.
గత ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ముంపు గ్రామాలను ఖాళీ చేయించకుండా, వారికి ప్రత్యామ్నాయ వసతులు చూపకుండా కాలయాపన చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను తీర్చే వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశాల్లో సీఎం చంద్రబాబు ముంపు బాధితులకు మేలు చేయడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యతని స్పష్టం చేశారు.
అందులో భాగంగానే ముంపు గ్రామాల ప్రజల ఆవేదనను గుర్తించి, యుద్ధప్రాతిపదికన ఈ నిధులను రిలీజ్ చేయించారు. ఖాతాల్లోకి లక్షలాది రూపాయల పరిహారం సొమ్ము పడటంతో మార్కాపురం రీజియన్లోని నిర్వాసిత గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “గతంలో కేవలం మాటలకే పరిమితమయ్యారు, కానీ చంద్రబాబు సర్కార్ వచ్చాక మా అకౌంట్లలోకి నిజంగానే డబ్బులు వచ్చాయి” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ నిధుల విడుదలతో ప్రాజెక్టు హెడ్ వర్క్స్, మిగిలిన కాలువల పనులు కూడా మరింత వేగంగా పూర్తి కావడానికి మార్గం సుగమమైంది.








