వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. నిమిషాల్లో మ్యాచ్ టిక్కెట్లు అవుట్..!
యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కళ్లు అన్నీ ఇప్పుడు 15 ఏళ్ల భారత బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) పైనే ఉన్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాలతో జరగబోయే టీ20 సిరీస్‌ల ద్వారా అతడు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడానికి సిద్ధమవడంతో ఒక సరికొత్త రికార్డు నమోదైంది. ఈ రోజే బెల్ఫాస్ట్లో జరగబోయే భారత్-ఐర్లాండ్ మొదటి టీ20 మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా కేవలం కొన్ని నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి.
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన వైభవ్‌కు.. ఆ తర్వాత శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లోనే 94 పరుగులు బాదినందుకు గానూ భారత జట్టులో చోటు దక్కింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ అరంగేట్ర మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి ఐరిష్ అభిమానులు ఎగబడ్డారు. దీంతో టిక్కెట్ల కోసం క్రికెట్ ఐర్లాండ్ (Cricket Ireland) బోర్డుకు తీవ్రమైన ఒత్తిడి ఎదురైంది.
అయితే దాదాపు 12,000 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న డబ్లిన్‌లోని మలాహిడ్ గ్రౌండ్లో కాకుండా.. కేవలం 4,500 నుండి 5,000 మంది సామర్థ్యం ఉన్న బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్లో ఈ మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడంపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వేదిక స్థల పరిమితి వల్ల కొన్ని నిమిషాల్లోనే టిక్కెట్లు క్లోజ్ అవ్వగా.. వేలాది మంది అభిమానులు టిక్కెట్లు దొరక్క నిరాశకు గురయ్యారు.
క్రికెట్ ఐర్లాండ్ ఛైర్మన్ బ్రయాన్ మాక్‌నీస్ మాట్లాడుతూ.. ఈ చిన్నారి సంచలనం సృష్టిస్తున్న క్రేజ్ అసాధారణమైనదని, తాము ఒకవేళ మూడు రెట్లు ఎక్కువ సీటింగ్ ఉన్న స్టేడియం పెట్టినా ఈ మ్యాచ్‌కు సులువుగా నిండిపోయేదని అభిప్రాయపడ్డారు. వైభవ్ సూర్యవంశీ ‘నేను అక్కడ ఉన్నాను’ అని గర్వంగా చెప్పుకునే ఒక చారిత్రాత్మక క్షణాన్ని అందించబోతున్నాడని, అందుకే ఐర్లాండ్‌లో ఈ మ్యాచ్‌కు ఇంతటి భారీ డిమాండ్ ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.








