సాయికృష్ణ శవాన్ని మాయం చేసిన ఇద్దరు ఖాకీలు..?
విజయవాడను వణికించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) దర్యాప్తులో ఊహించని షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సాయికృష్ణ కస్టడీ మరణాన్ని దాచిపెట్టి, మృతదేహాన్ని మాయం చేయడంలో అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజుకు పోలీస్ సిబ్బందితో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తి కూడా నమ్మకంగా సహకరించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. కృష్ణలంక(Krishna lanka) పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ మరణించిన తర్వాత, ఆ అపవాదు నుంచి తప్పించుకోవడానికి సీఐ నాగరాజు పక్కా ప్లాన్ వేశారు.
ఈ క్రమంలో సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసే బాధ్యతను ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు తన స్నేహితుడైన సురేష్ అనే వ్యక్తికి సీఐ అప్పగించినట్లు సిట్ విచారణలో తేలింది. సీఐ నాగరాజు అరెస్ట్ అయిన వెంటనే.. సాయం చేసిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లలో ఒకరైన అశోక్.. సీఐ నాగరాజుకు అత్యంత నమ్మకమైన అసిస్టెంట్‌గా వ్యవహరించేవాడు. స్టేషన్లో జరిగే ప్రతి వ్యవహారంలోనూ ఇతని పాత్ర ఉండేది.
ఇక మరో హెడ్ కానిస్టేబుల్ జంగం నాని చరిత్ర చూస్తే పెద్ద నేరగాడి డైరీని తలపిస్తోంది. గతంలో సీఐ పేరు చెప్పుకుంటూ విజయవాడలో పెద్ద ఎత్తున ప్రైవేట్ దందాలు, సెటిల్మెంట్లు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. గన్నవరం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు ఇతని అక్రమాలపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ తర్వాత పటమట పోలీస్ స్టేషన్లోనూ వివాదాస్పద అక్రమాలకు పాల్పడటంతో ఉన్నతాధికారులు ఇతడిని వీఆర్ (Vacancy Reserve)కు పంపించారు.
అంతటి వివాదాస్పద చరిత్ర ఉన్న హెడ్ కానిస్టేబుల్ జంగం నానికి ఉన్నతాధికారులు ఇటీవలే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు. అక్కడకు వచ్చిన తర్వాత కూడా మారకుండా.. మళ్లీ పాత దందాలు సాగిస్తూ, సీఐ నాగరాజుతో చేతులు కలిపి ఏకంగా లాకప్ డెత్ కేసులో శవాన్ని మాయం చేసే స్థాయికి బరితెగించాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నానిలతో పాటు సీఐ స్నేహితుడు సురేష్ కోసం సిట్ ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకుని, సాయికృష్ణ మృతదేహాన్ని ఎక్కడకు తరలించారు? సాక్ష్యాలను ఎలా ధ్వంసం చేశారు? అనే కోణంలో మరిన్ని నిజాలు రాబట్టేందుకు సిట్ రంగం సిద్ధం చేసింది.








