25th June 2026

__________

- Saidulu

ఇంట్లోనే కమ్మని సాంప్రదాయ సాంబార్.. ఈ చిన్న చిట్కాలతో రుచి డబుల్..

ఇంట్లో చేసే సాంబార్ ఎంత బాగున్నా, కొన్ని ఇళ్లలో మాత్రం ఒక ప్రత్యేకమైన సంప్రదాయ రుచి ఉంటుంది. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే ఎంతో కమ్మని సాంప్రదాయ సాంబార్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు.

సాంబార్ రుచికి ప్రధాన కారణం తాజా మసాలానే. రెడీమేడ్ పొడుల కంటే ఇంట్లోనే తాజాగా వేయించి నూరిన మసాలాతో చేసే సాంబార్‌కు మంచి వాసన, రుచి వస్తుంది.

మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి వంటి దినుసులను కాస్త నూనెలో తక్కువ మంటపై వేయించాలి. చివర్లో కొబ్బరి తురుము వేస్తే రుచి మరింత పెరుగుతుంది.

దినుసులు వేగిన వెంటనే వాటిని వేరుగా తీసి పెడితే అవి మాడిపోవు. దీంతో మసాలాలోని సహజమైన సువాసన అలాగే నిలిచి ఉంటుంది.

కందిపప్పును బాగా మెత్తగా ఉడికించాలి. మరోవైపు గుమ్మడికాయ ,బంగాళదుంప, టమోటా, వంకాయ వంటి కూరగాయలను ఉప్పుతో ఉడికిస్తే సాంబార్‌కు మంచి రుచి వస్తుంది.

కూరగాయలు మెత్తబడిన తర్వాత చింతపండు రసం, పచ్చిమిర్చి, ఉడికిన పప్పు కలిపి మరిగించాలి. కొద్దిగా బెల్లం వేయడం వల్ల పులుపు, కారం రుచులు సమతుల్యం అవుతాయి.

చివరగా నెయ్యిలో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టాలి. ఆ సువాసనతో ఇల్లంతా కమ్మని వంట వాసన వ్యాపిస్తుంది.

వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ సాంబార్ తింటే ఆ రుచి మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఒకసారి ఇలా చేస్తే ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది.