ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకం, 15 ఏళ్ళ బుడ్డోడిపై ఫోకస్..!
క్రికెట్ ప్రపంచంలోకి అప్పుడప్పుడు కొందరు అద్భుతమైన కుర్రాళ్లు దూసుకొస్తుంటారు. కానీ, ఆడే కొద్దీ ఒత్తిడి పెరిగే పెద్ద మ్యాచ్‌లలో చాంపియన్‌లా నిలబడే ఆటగాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. ప్రస్తుతం సరిగ్గా ఇలాంటి అంచనాలతోనే భారత క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్నాడు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ. వయసు కేవలం 15 ఏళ్లే అయినా, మైదానంలో అతను చూపిస్తున్న పరిణతి, ఆడుతున్న విధ్వంసకర ఇన్నింగ్స్‌లు చూస్తుంటే దిగ్గజాలు సైతం నోరెళ్లబెడుతున్నారు.
ఇటీవల దంబుల్లా వేదికగా శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ ఈ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. ఈ టోర్నమెంట్లో అంతకుముందు వరకు కాస్త నిలకడలేమితో ఇబ్బంది పడిన వైభవ్.. ఫైనల్స్ వంటి పెద్ద వేదికపై ఒక్కసారిగా శివాలెత్తాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న ఈ కుర్రాడు 94 పరుగులతో లంక బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. కేవలం 10 ఓవర్ల లోపే మ్యాచ్ వన్‌సైడ్ అయిపోయేలా చేయడంలో సచిన్ టెండూల్కర్, క్రిస్ గేల్ వంటి దిగ్గజాల శైలిని అతను గుర్తుచేశాడు.
ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లోనూ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో 33 బంతుల్లోనే 68 పరుగులు చేసి టీమిండియా రికార్డ్ ఛేజింగ్‌కు పునాది వేశాడు. ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన హై-ప్రెజర్ ఫైనల్ మ్యాచ్‌లో మొదట పిచ్ పరిస్థితులను గౌరవిస్తూ నిలదొక్కుకున్న వైభవ్.. ఆ తర్వాత కేవలం 55 బంతుల్లోనే అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ బాదాడు. ఆ మ్యాచ్‌లో 175 పరుగులు చేసి ఈ టోర్నమెంట్ ఫైనల్స్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు.
ఈ 15 ఏళ్ల కుర్రాడి ప్రతాపం కేవలం ఏజ్-గ్రూప్ క్రికెట్ కే పరిమితం కాలేదు. వరల్డ్ టాప్ లీగ్ ఐపీఎల్‌లోనూ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ సంచలనం సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన ‘ఎలిమినేటర్’ మ్యాచ్‌లో అంతర్జాతీయ అనుభవం ఉన్న పాట్ కమిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ఊచకోత కోశాడు. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయినప్పటికీ, ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా దానిని నిలిపాడు. ఎంత పెద్ద మ్యాచ్ అయితే వైభవ్ అంతగా రాణిస్తాడని ఈ ఇన్నింగ్స్ నిరూపించింది.








